నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించం
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:49 PM
నోటీసు ఇవ్వకుండా అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు తొలగించడం జరగదని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు.
ఫ యువ ఓటర్లపై దృష్టి పెట్టాలి
ఫ జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ గోపాలకృష్ణ
విజయనగరం, కలెక్టరేట్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): నోటీసు ఇవ్వకుండా అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు తొలగించడం జరగదని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా, అత్యంత ఖచ్చితమైన జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చడంతోపాటు, యువ ఓటర్లపై పెట్టాలని తెలిపారు. శుక్రవారం సాయంత్రం సర్ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీ నాయకులు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో ఆయన సమావేశం నిర్వహించారు. ముందుగా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో సర్ పురోగతిని వివరిస్తూ, మ్యాపింగ్ కాని ఎనామిలీస్‌కు సంబంధించి సుమారు 1,93,734 మందికి నోటీసులు అందజేసినట్లు తెలిపారు. వారి నుంచి వివరణ తీసుకున్న తరువాత వారి ఓటుపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈనెల 29,30 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ రెండు రోజుల పాటు బీఎల్‌వోలు అంతా పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ సారి కూడా 2004 జాబితాతో మ్యాపింగ్ చేసి ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ముసాయిదా జాబితాను ప్రచురించామన్నారు. పలు మార్పులు, చేర్పులు అనంతనం అక్టోబరు 3న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. జిల్లాలో 82 వేల మంది యువ ఓటర్లను చేర్పించాల్సి ఉందన్నారు. స్వీప్‌పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ఈపి రేషియో (జనాభాల ఓటర్ల శాతం )పై సంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ సేతుమాధన్ మాట్లాడుతూ.. స్వీప్‌పై ప్రచారం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో అరుణకుమారి, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.