Share News

ఆ పాఠశాలల్లో మా పిల్లలను చేర్పించం

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:50 PM

ఒకప్పుడు ఆ వార్డులో ఉన్న రెండు పాఠశాలలు పట్టణానికే తలమానికం. ఆ పాఠశాలల ఒడిలో అక్షరాలు దిద్దిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

 ఆ పాఠశాలల్లో మా పిల్లలను చేర్పించం
విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు

- ఉపాధ్యాయులకు తెగేసి చెబుతున్న తల్లిదండ్రులు

- కానరాని సౌకర్యాలు.. కొరవడిన అధికారుల పర్యవేక్షణ

- ఇదీ గుమడాంలో పరిస్థితి

సాలూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఆ వార్డులో ఉన్న రెండు పాఠశాలలు పట్టణానికే తలమానికం. ఆ పాఠశాలల ఒడిలో అక్షరాలు దిద్దిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఉపాధ్యాయులుగా, త్రివిధ దళాల్లో సైనికులుగా, లాయర్లగా, పోలీసు అధికారులుగా ఇలా ఒక్కటి కాదు అన్ని రంగాల్లో పని చేస్తున్నారు. ఆ పాఠశాలల్లో బోధనను చూసి ఇతర వార్డుల్లో ఉన్న విద్యార్థులు సైతం ఆ బడుల్లో చేరే వారు. అంతటి పేరున్న ఆ పాఠశాలలు నేడు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. కుల వివక్ష, సౌకర్యాల లేమి, ఇరుకు గదులు, పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో ఇక్కడ చేరేందుకు విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. ఈ పాఠశాలలకు ఆనుకుని ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్న వారు కూడా తమ పిల్లలను చేర్పించడం లేదు. మహిళా ఉపాధ్యాయులు వెళ్లి అడిగితే.. ‘అమ్మా...క్షమించండి.. ఆ పాఠశాలల్లో మా పిల్లలను చేర్పించలేం’ అంటూ వారి ముఖంపైనే చెప్పేస్తున్నారు. ఇదీ సాలూరు పట్టణం మూడో వార్డు గుమడాంలోని మున్సిపల్‌ ప్రైమరీ పాఠశాల, గుమడాం ఎస్సీ కాలనీలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల(ఆర్‌) పరిస్థితి.

- మున్సిపల్‌ ప్రైమరీ పాఠశాల గుమడాం ఊరిలోకి వెళ్లే దారిలో ఉంటుంది. మరో పాఠశాల ఊరి మధ్యలో ఉన్న ఎస్సీ కాలనీలో ఉంటుంది. ప్రైమరీ పాఠశాల భవనం పూర్తిగా శిథిలం కావడంతో గత వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింద తొలగించి కొత్తది నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఈ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ పాఠశాలలో 24 మంది విద్యార్థులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తయారు చేసేందుకు ఇద్దరు మహిళలు పని చేస్తున్నారు.

- ఎస్సీ కాలనీ పాఠశాలకు రెండు భవనాలు ఉన్నాయి. ఇక్కడ నలుగురు విద్యార్థులకు గాను ఒక ఉపాధ్యాయురాలు పని చేస్తున్నారు. నలుగురు విద్యార్థులకు ఇద్దరు వంట కార్మికులు మధ్యాహ్న భోజనం వండుతున్నారు.

అక్కడకు పంపించం..

మున్సిపల్‌ ప్రైమరీ పాఠశాలకు భవనం లేకపోవడంతో మూడేళ్ల కిందట అక్కడి విద్యార్థులను ఎస్సీ కాలనీలోని పాఠశాలకు మార్చారు. ఈ రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు 28 మంది ఒకేచోట చదువుతున్నారు. వీరికి నలుగురు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. గతంలో ఈ విద్యార్థుల సంఖ్య 60 వరకు ఉండేది. అయితే, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించడం ఇష్టంలేక ప్రైవేట్‌ స్కూళ్లకు పంపిస్తున్నారు. ఉపాధ్యాయులు ఎంత నచ్చ చెప్పినా వారు వినడం లేదు. ఇరుకు వంట గది, తరగతి గదులు చాలకపోవడం, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇక్కడ చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పిల్లలను పంపించడం లేదు

పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని వారి తల్లిదండ్రులను కలుస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను వివరిస్తున్నాం. ఎంత నచ్చచెప్పినా పిల్లలను పంపించడం లేదు. గ్రామంలో కుల వివక్ష చాలా ఎక్కువగా ఉంది.

-శ్యామల, ప్రధాన ఉపాధ్యాయురాలు, గుమడాం

నిధులు మంజూరైతే నిర్మాణం

నిధులు వచ్చిన వెంటనే గుమడాం మునిసిపల్‌ ప్రైమరీ పాఠశాల భవనం నిర్మిస్తాం. పాఠశాలకు భవనం లేకపోవడంతో విద్యార్థులు చేరడం లేదు.

ఎన్‌.వెంకటనాయుడు, ఎంఈవో 2, సాలూరు.

Updated Date - Jul 10 , 2026 | 11:50 PM