హామీలు నెరవేరుస్తాం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:16 AM
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు. శుక్రవారం కేటీవాడ పంచాయతీలోని నీచుకవలసలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు.
జియ్యమ్మవలస, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు. శుక్రవారం కేటీవాడ పంచాయతీలోని నీచుకవలసలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతుకు రూ.20 వేలు వారి ఖాతాలో జమ చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఇటీవల మూడో విడత రూ. ఆరు వేలు జమ చేశామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఏటా ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు గతేడాది 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయడంతోపాటు కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారన్నారు. ఉగాది రోజు 10,060 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. గరుగుబిల్లి, జియ్యమ్మవలస రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎత్తిపోతల పథకాలు పూర్తిచేస్తామని తెలిపారు. కేటీవాడ పంచాయతీలో రోడ్లు నిర్మిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, అరకు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, కురుపాం ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, ఎంపీపీ బొంగు సురేష్, మండల కన్వీనర్ జోగి భుజంగరావు, బీజేపురం పీఏసీఎస్ చైర్మన్ డి.సోములు పాల్గొన్నారు.
ఫ కురుపాం, మార్చి20(ఆంధ్రజ్యోతి): ముస్లింలు అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. కురుపాంలోని శివ్వన్నపేటలో గల ముస్లింలకు శుక్రవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జగదీశ్వరి ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోపా కిట్లు అందజేశారు. కార్యక్రమంలో కేవీ కొండయ్య, రంజిత్‌కుమార్, షేక్ సాదుబాషా పాల్గొన్నారు.