పంటనష్టం చెల్లించేవరకు పోరాడతాం
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:17 AM
సంకిలి ఈఐడీ ప్యారీ సుగర్స్ అనుబంధ పరిశ్రమ ఇథనాల్ ప్లాంట్ వ్యర్థజలాలతో సంకిలి నాయుడుచెరువు ఆయకట్టు 60 ఎకరాల వరిపంట నష్టంపై ఆ గ్రామ రైతులు మరో సారి ఆందోళన బాట పట్టారు.
ఇథనాల్ వ్యర్థ జలాలపై రైతుల ఆందోళన
పరిశ్రమ ఎదుట బైఠాయింపు
రేగిడి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): సంకిలి ఈఐడీ ప్యారీ సుగర్స్ అనుబంధ పరిశ్రమ ఇథనాల్ ప్లాంట్ వ్యర్థజలాలతో సంకిలి నాయుడుచెరువు ఆయకట్టు 60 ఎకరాల వరిపంట నష్టంపై ఆ గ్రామ రైతులు మరో సారి ఆందోళన బాట పట్టారు. గత నెలలో షుగర్స్ మెయిన్ గేట్ ఎదుట నిరసన తెలిపినా యాజమా న్యం స్పందించలేదు. దీంతో గురువారం ఇథనాల్ ప్లాంట్ గేట్ ఎదుట మరోసారి శాంతియుత ధర్నా నిర్వహించారు. దాదాపు 50 మంది రైతులు ధర్నాలో పాల్గొని.. యాజమాన్యం, పొల్యుషన్ బోర్డు తప్పుడు నివేదికలపై మండిపడ్డారు. యాజమాన్య ప్రతినిధి జీఎం సూర్యతేజ వారితో చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. నష్ట పరిహారంపై ఒక ఏకభిప్రాయానికి రాక పోవటంతో చర్చలు సోమవారానికి వాయిదా వేశారు. తమ పొలాలకు పరిహారం చెల్లించేవరకు పోరాటం ఆపబోమని, ప్రతిరైతుకూ న్యాయం చేయాలని వారంతా డిమండ్ చేశారు.