Tourism Hub టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:31 AM
We Will Develop It as a Tourism Hub మన్యం జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. శనివారం పారమ్మకొండ వద్ద పర్యటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కొండదిగువున ఉన్న పారమ్మతల్లిని దర్శించుకున్నారు.
పాచిపెంట రూరల్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. శనివారం పారమ్మకొండ వద్ద పర్యటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కొండదిగువున ఉన్న పారమ్మతల్లిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అరకు, ఊటి తరహాలోనే తరహాలోనే మన్యంలో ఎత్తయిన కొండలు, లోయలు, లొద్ద జలపాతం వంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక కేంద్రాల అభివృద్ధి చేస్తామన్నారు. పురాతమైన పారమ్మతల్లి ఆలయ అభివృద్ధి, పర్యవేక్షణకు పాచిపెంట, సాలూరు ప్రజలు, అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యాటక శాఖ ద్వారా కూడా నిధులు సేకరించి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ఆమె తెలిపారు. ఇక్కడ ఏడు కొండలు వరుసగా ఉన్నందున గతంలో టీటీడీ వారు కల్యాణ మండపం నిర్మాణానికి ఇది అనువైన ప్రాంతంగా పరిశీలించినట్టు గుర్తు చేశారు. ఈ మండలంలో ఆలూరు, నీలాయమ్మవలస వద్ద జలపాతాలు, పెద్దగెడ్డ, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రాజెక్టుల్లో చిన్న బోట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. పర్యాటకాభివృద్ధి వల్ల స్థానిక గిరిజనులు, బీసీలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. స్థానిక జలపాతాల వద్ద వీబీజీరాంజీ పథకం కింద రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సాలూరు నియోజకవర్గంలో గడిచిన రెండేళ్లలో దాదాపు రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల థింసా నృత్యాలు, కోలాటం అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గులు, వక్తృత్వ పోటీల్లో విజేతలైన పిల్లలకు బహుమతులు అందించారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో పర్యాటకుల సంఖ్య సుమారు 27 రెట్లు పెరిగిందన్నారు. పారమ్మకొండ ఒక నూతన పర్యాటక ఆకర్షణగా మారుతుందన్నారు. ఈ కార్య క్రమంలో ఆర్డీవో మాధురి, టూరిజం జిల్లా అధికారి శైలజ, సాలూరు ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.