Share News

Model District ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:12 AM

We Will Develop It as a Model District జిల్లాలో గణతంత్ర సంబరాలు అంబరాన్నంటాయి. మువ్వన్నెల జెండా మురిసింది. ప్రతి మదిలో దేశభక్తి ఉప్పొంగింది. సోమవారం పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీస్‌ వందనాన్ని స్వీకరించారు.

Model District ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

  • గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

  • ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జాగిలాలు, శకటాల ప్రదర్శన

పార్వతీపురం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గణతంత్ర సంబరాలు అంబరాన్నంటాయి. మువ్వన్నెల జెండా మురిసింది. ప్రతి మదిలో దేశభక్తి ఉప్పొంగింది. సోమవారం పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీస్‌ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన్యం జిల్లా అభివృద్థి పథంలో పయనిస్తోంది. అన్ని రంగాల్లో ప్రగతే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో మన్యాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటివరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 48,799 వినతులు రాగా వాటిల్లో 46,199 అర్జీలను పరిష్కరించాం. ప్రస్తుతం అన్ని మండలాల పరిధిలో ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమాలు చేపడుతున్నాం. రెవెన్యూ క్లినిక్‌కు ఇప్పటివరకు 542 అర్జీలు రాగా వాటిల్లో 420 వినతులను పరిష్కరించాం. జిల్లాలో సుమారు కోటీ 5 లక్షల మంది స్ర్తీశక్తి పథకాన్ని వినియోగించుకున్నారు. 15 మండలాల పరిధిలోని 354 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. 280 గ్రామాల్లో 64,879 మందికి నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించాం. ఖరీఫ్‌ రైతుల నుంచి 2,27,495 మెట్రిక్‌ టన్నుల రైతుల నుంచి ధాన్యం సేకరించాం. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకం కింద జిల్లాలో 1,22,260 మందికి రెండు విడతల్లో రూ. 169.44 కోట్లు అందించాం. పార్వతీపురంలో భూసార పరీక్షా కేంద్రాన్ని పునరుద్ధరించాం. ఉపాధి హామీ పథకం ద్వారా 90 శాతం రాయితీపై 382 గోకులాలు, 70 శాతం రాయితీపై గొర్రెలు, మేకలు, కోళ్ల్లు, షెడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. రూ.154 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా వరుసగా మూడేళ్ల పాటు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం కూడా మొదటి ర్యాంకును సాధించాలనే లక్ష్యంతో ప్రత్యేక అధికారులను నియమించాం. తల్లికి వందనం పథకం కింద జిల్లాలో 1,14,616 మంది తల్లుల ఖాతాల్లో సుమారు రూ. 171.92 కోట్లు జమ చేశాం. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ముస్తాబు , క్రీడలు కార్యక్రమాలు జిల్లాకే గర్వకారణంగా నిలిచాయి. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నాయి. మన తోట కింద జిల్లాలో 1272 పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేశాం. సీతంపేటలో రూ.18 కోట్లతో వంద పడకల ఆసుపత్రి, సాలూరులో రూ.17 కోట్లతో ప్రాంతీయ ఆసుపత్రి, భద్రగిరిలో రూ. 8.95 కోట్లతో సామాజిక ఆసుపత్రి అభివృద్ధి పనులు చేడుతున్నాం. మలేరియా కేసులు 20 శాతం వరకు తగ్గాయి. ఇంటింటికీ కుళాయిల కోసం ఇప్పటివరకు రూ.రూ.97 కోట్లు వెచ్చించాం. ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల కోసం సీతంపేట మండలం పనుకువలసలో 27.26 ఎకరాల స్థలాన్ని గుర్తించి అభివృద్ధి నులు చేపడుతున్నాం. ఈ ఏడాదిలో రూ.58.26 కోట్లతో 740 మందికి ఉపాధి కల్పిస్తాం. 57 యూనిట్లు స్థాపనకు గాను వివిధ శాఖల నుంచి అనుమతులు మంజూరయ్యాయి. పీఎం ఉపాధి కల్పన పథకం కింద ఇప్పటివరకు 85 యూనిట్లు మంజూరయ్యాయి. ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా మొదటి స్థానంలో ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 87 లక్షల పని దినాలు కల్పించాం. జిల్లాకు 204 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు మంజూరయ్యాయి. 2030లో నిర్వహించే కామన్‌వెల్త్‌గేమ్స్‌లో జిల్లా క్రీడాకారులు పాల్గొని పతకాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దీపం-2 పథకంలో ఇప్పటివరకు మూడు దశల్లో 5,19,968 మంది లబ్ధి పొందారు. జిల్లాలో 12 జాబ్‌ మేళాలు నిర్వహించి 744 మంది యువతకు ఉపాధి కల్పించాం. ఆరు డి గ్రీ కళాశాలల్లో స్కిల్స్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం.’ అని కలెక్టర్‌ తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు , వివిధ శాఖల శకటాలు, స్టాళ్లు , పోలీస్‌ జాగిలాల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

పింఛన్లు...మహిళా సంక్షేమం....

‘ జిల్లాలోని 1,39,291 మంది పింఛన్‌దారులకు ప్రతినెలా సుమారు రూ.60 కోట్లు పంపిణీ చేస్తున్నాం. బ్యాంకు లింకేజీల ద్వారా 4,892 మహిళా సంఘాలకు రూ.427 కోట్లు మంజూరు చేశాం. స్ర్తీ నిధి ద్వారా 7,726 మందికి రూ.61.83 కోట్లు, ఉన్నతి ద్వారా 225 మందికి రూ.కోటి 37 లక్షలు మంజూరు చేశాం. జిల్లాలో అంగన్‌వాడీ సిబ్బందికి 2169 మొబైల్‌ ఫ్లోన్లను అందించాం. మెయిన్‌ కార్యకర్తలుగా 217 మందికి పదోన్నతి కల్పించాం. 619 కేంద్రాలను ఆధునికీకరించాం. 36 కేంద్రాల నిర్మాణానికి రూ.మూడు కోట్లు మంజూరయ్యాయి. ’ అని కలెక్టర్‌ తెలిపారు.

గిరిజనులకు అండగా...

‘గిరిజనులకు అదనపు ఆదాయం వచ్చేలా జిల్లాలో 54 వన్‌దన్‌ వికాస్‌ కేంద్రాలు, వెలుగు ద్వారా జీడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ , గుమ్మలక్ష్మీపురంలో మహిళా మార్టులను ఏర్పాటు చేయించాం. 1828 మంది మహిళలకు రూ. 20.32 కోట్ల మేర రుణ సదుపాయాన్ని కల్పించాం. జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ కార్యక్రమం కింద 5,169 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ పథకం కింద 7,312 గృహాలు మంజూరు చేశాం.ఏజెన్సీ ప్రాంతాల్లో 225 రోడ్ల పనులకు శ్రీకారం చుట్టాం. కొత్తగా మరో 140 సిమెంట్‌ రోడ్లు మంజూరు చేశాం. ఆడలి వ్యూపాయింట్‌ వద్ద హోం స్టేషన్‌ ఏర్పాటు చేశాం. కురుపాం, సీతంపేట, సాలూరు, గుమ్మలక్షీమపురం మండలాల్లో జలపాతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. ఇంతవరకు విద్యుత్‌ సౌకర్యం లేని 3,400 పీవీటీజీ గృహాలకు, 3382 నాన్‌ ిపీవీటీజీ గృహాలకు విద్యుత్‌ కనెక్షన్లు అందించాం. కళాకారుల కోసం మన్యం కళా వేదికను ఏర్పాటు చేశాం.’ అని కలెక్టర్‌ వెల్లడించారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన సుమారు 552 మంది ఉత్తమ అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా ప్రధాన న్యాయాధికారి దామోదరరావు, ఎస్పీ మాధవరెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్‌వో హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 12:12 AM