We will catch it with drone cameras డ్రోన్ కెమెరాలతో పట్టేస్తాం
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:21 AM
We will catch it with drone cameras జిల్లాలో కోడి పందేలు, పేకాట, పొట్టేళ్ల పందేలు, గుండాట తదితర జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రోన్ కెమెరాలతో కనిపెడతామని, వీటికి దూరంగా ఉండాలని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.
డ్రోన్ కెమెరాలతో పట్టేస్తాం
కోడి పందేలు, పేకాటకు దూరంగా ఉండాలి
80 మందిపై బైండోవర్ కేసులు
ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోడి పందేలు, పేకాట, పొట్టేళ్ల పందేలు, గుండాట తదితర జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రోన్ కెమెరాలతో కనిపెడతామని, వీటికి దూరంగా ఉండాలని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. పట్టుబడితే హిస్టరీ షీట్లు తెరుస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో పేకాట, కోడి పందేలతో ప్రమేయం ఉన్న 80 మంది వ్యక్తులను గుర్తించి, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద బైండోవర్ చేశామన్నారు. కోడి పందేల నియంత్రణకు హైకోర్టు ఆదేశాలతో మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసులు, జంతు సంరక్షణ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి, సంక్రాంతి పండగను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకోవాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టవద్దని, వాటిలో భాగస్వాములు కావద్దని కోరుతున్నాయన్నారు. కోడిపందేలు, జూదం, పొట్టేళ్ల పందేలు చట్టరీత్యా నేరమని, ప్రోత్సహించిన వారినీ ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు.
==============