We Will Bring in Funds నిధులు తీసుకొస్తాం
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:21 AM
We Will Bring in Funds ‘జిల్లాలోని సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతాం.. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాం.. నిధుల మంజూరుకు కృషి చేస్తాం..’ మంత్రి, ఎమ్మెల్యేలు తెలిపారు. శనివారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
జిల్లా ఎమ్మెల్యేల ప్రకటన
నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశం
(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)
‘జిల్లాలోని సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతాం.. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాం.. నిధుల మంజూరుకు కృషి చేస్తాం..’ మంత్రి, ఎమ్మెల్యేలు తెలిపారు. శనివారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జిల్లాకు ఎంతమేర నిధులు అవసరమో.. ఇప్పటికే జాబితాను ప్రభుత్వానికి సమర్పించారు. అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశంలోనూ ‘అధ్యక్షా’.. అంటూ మన్యం ప్రజా ప్రతినిధులు తమ వాణిని వినిపించనున్నారు. తద్వారా నిధుల కేటాయింపునకు తమవంతు కృషి చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.
జిల్లా అభివృద్ధికి కృషి
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా. అద్దె భవనాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటి నిర్మాణాల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా. గిరిశిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణంతో పాటు జిల్లాలోని అనేక అభివృద్ధి పనులకు నిధులు ఎంతో అవసరం. వాటి కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తా. ప్రజా సమస్యలు, పర్యాటక అభివృద్ధిపై మాట్లాడుతా.
- గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
================================
బైపాస్ రహదారిపై ప్రస్తావిస్తా..
పార్వతీపురం పట్టణానికి బైపాస్ రహదారి ఎంతో అవసరం. దీని నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బడ్జెట్ సమావేశంలో కోరుతా. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు అదనపు వసతి గృహాలు ఏర్పాటు, అడారుగెడ్డ, వరహాలగెడ్డ, పెదంకలం ప్రాజెక్టులకు సంబంధించి నిధులు మంజూరు కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తా. పార్వతీపురం మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా.
- బోనెల విజయచంద్ర, ఎమ్మెల్యే, పార్వతీపురం
===============================
కాలువల మరమ్మతులకు నిధులు అవసరం
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి పాలకొండ నియోజకవర్గానికి సాగునీరు పూర్తి స్థాయిలో అందాల్సి ఉంది. ఈ మేరకు పాత ఆయకట్టు పరిఽధిలో కాలువలను మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. దీని కోసం బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలి. భామిని మండలంలో లి్‌ఫ్ట్ ఇరిగేషన్, డిగ్రీ కళాశాల ఏర్పాటు, వీరఘట్టంలో డిగ్రీ కళాశాల భవనాల మంజూరుకు నిధులు కేటాయించాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తా.
- నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్యే, పాలకొండ