We will be in protest బరిలో ఉంటాం
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:04 AM
We will be in protest నాకు మా పార్టీ అధిష్ఠానం బీఫారం ఇచ్చింది. తప్పకుండా బరిలో ఉంటాను. కనీసం నియోజకవర్గంలో ఒక్క జడ్పీటీసీ అయినా ఇవ్వకుంటే ఎలా? అసెంబ్లీ ఎన్నికల్లో బేషరతుగా పనిచేశాను. ఇప్పుడు నాకు కచ్చితంగా అవకాశం ఇచ్చి తీరాలి. ఇన్నిరోజులు కష్టపడినందుకు ఫలితం దక్కాలి.
బరిలో ఉంటాం
ఒకేస్థానానికి కూటమిలోని మూడు పార్టీలు పోటీ
తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు, కీలక నేతలు
సమన్వయానికి ప్రయత్నాలు
చాలా చోట్ల ఇదే పరిస్థితి
జడ్పీటీసీ, ఎంపీటీసీలకు అధికంగా నామినేషన్లు
నేడు ఉపసంహరణకు అవకాశం
నాకు మా పార్టీ అధిష్ఠానం బీఫారం ఇచ్చింది. తప్పకుండా బరిలో ఉంటాను. కనీసం నియోజకవర్గంలో ఒక్క జడ్పీటీసీ అయినా ఇవ్వకుంటే ఎలా? అసెంబ్లీ ఎన్నికల్లో బేషరతుగా పనిచేశాను. ఇప్పుడు నాకు కచ్చితంగా అవకాశం ఇచ్చి తీరాలి. ఇన్నిరోజులు కష్టపడినందుకు ఫలితం దక్కాలి.
- ఓ మండలానికి చెందిన జనసేన తరుపున జడ్పీటీసీగా నామినేషన్ వేసిన నేత ఆవేదన
- మన పార్టీ బలం ఉన్నచోట ఆ పార్టీకి అవకాశం ఇవ్వడం ఏంటి? నేనే బరిలో ఉంటాను. కచ్చితంగా మన పార్టీ అక్కడ బలంగా ఉంది. గెలిచిన చోట వెనక్కి తగ్గడం ఏంటి? స్నేహపూర్వక పోటీకైనా నేను సిద్ధమే? ఎందుకంటే ఆ పార్టీకి తగినంత బలం లేదు.
- బీజేపీకి సీటు కేటాయించిన చోట టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నేత అభిప్రాయం ఇది..
- నేను ఎంపీపీ రేసులో ఉన్నాను. కచ్చితంగా నేను ఇక్కడ ఎంపీటీసీగా బరిలో ఉంటాను. నాకు ఈ సీటు వదిలేయ్యండి. లేకుంటే రెబల్‌గానైనా బరిలో ఉంటా. ఈ విషయంలో ఎవరు చెప్పినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. కాదు కూడదు అంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేసుకోండి. రాకరాక అవకాశం వస్తే ఎలా వదులుకోమంటారు చెప్పండి?
- జనసేనకు కేటాయించిన సీటులో నామినేషన్ వేసిన టీడీపీ నేత మనోగతం ఇది..
విజయనగరం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి)
గజపతినగరంలో గజిబిజి వాతావరణం నెలకొంది. కూటమి పార్టీల నాయకుల మధ్య సఖ్యత కుదరడం లేదు. జడ్పీటీసీల నుంచి ఎంపీటీసీల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. కూటమి నుంచి ఒకే జడ్పీటీసీ పదవికి రెండునామినేషన్లు పడ్డాయి. దీంతో ఆ ఇరుపార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎవరిని తప్పించాలో ..ఎవరిని బరిలో ఉంచాలో తెలియడం లేదు. మరోవైపు అభ్యర్థులిద్దరూ తగ్గేదేలే అన్న ధోరణిలో ఉన్నారు. ఇదే పరిస్థితి చాలా మండలాల్లో ఉంది. దీంతో ప్రాదేశిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండడంతో ఎమ్మెల్యేలు, కూటమి నేతలు నియోజకవర్గాలు, మండలాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేతలను బుజ్జగిస్తున్నారు. కానీ దారికి రావడం లేదు. ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యేలు కొందరికి హామీ ఇస్తున్నారు.
జిల్లాలో 27 మండలాల నుంచి జడ్పీటీసీలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి ఏకంగా 93, జనసేన నుంచి 49, బీజేపీ నుంచి 13 నామినేషన్లు దాఖలయ్యాయి. భోగాపురం నుంచి జనసేన అభ్యర్థిగా చెల్లుబోయిన నవ్యశ్రీ నామినేషన్ వేశారు. అక్కడి నుంచి కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళ కూడా నామినేషన్ వేశారు. పక్కన ఉన్న డెంకాడ మండలంలోనూ ఇదే పరిస్థితి. చివరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరంలోనూ అంతే. అయితే చాలాచోట్ల డమ్మీలుగా వేశారు. కానీ ప్రధాన నియోజకవర్గాల్లో సమన్వయం లేక పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అటువంటి చోట విత్‌డ్రా చేయించేందుకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రతిచోటా ఇప్పుడు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బుజ్జిగింపులకు దిగుతున్నారు. ఎంపీపీ అభ్యర్థులతో పాటు జడ్పీటీసీలుగా బరిలో ఉన్నవారు సమన్వయానికి నడుంబిగించారు. విత్‌డ్రా అయ్యేందుకు 27 వరకు గడువు ఉండడంతో అభ్యర్థులను కొలిక్కి తెస్తామన్న ఆశాభావంతో కూటమి నేతలు ఉన్నారు.
అందరూ గట్టివారే..
నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమిలో అంతర్గత విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. నామినేషన్ల దాఖలు పరిణామాలు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తమ కుమార్తెను సొంతమండలంలో జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయించారు. ఇదే మండలం నుంచి జనసేన తరుపున చెల్లుబోయిన నవ్యశ్రీ నామినేషన్ వేశారు. వీరితో పాటు డెంకాడలోనూ అదే పరిస్థితి నెలకొంది. టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ తన భార్య రమాదేవితో జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయించారు. ఈమె జడ్పీ చైర్మన్ రేసులో ఉండాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయమై వీరితో మాట్లాడేందుకు పెద్ద నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
---------------