We take pride in being teachers. గురువులుగా గర్విస్తున్నాం
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:41 PM
We take pride in being teachers. ఆచార్యదేవోభవః అని కీర్తించే ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనేది చాలా మందికి ఓ కల. దానిని సాకారం చేసుకోవాలని పగలు..రేయి కష్టపడుతుంటారు. సంవత్సరాల పాటు పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు.
గురువులుగా గర్విస్తున్నాం
విధుల్లో చేరి ఏడాదైన ఆనందంలో మెగా డీఎస్సీ మాస్టార్లు
జిల్లా వ్యాప్తంగా 578 మంది ఎంపిక
కొత్త అనుభవాలతో మరింత ఉత్సాహంగా విధులు
ఆచార్యదేవోభవః అని కీర్తించే ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనేది చాలా మందికి ఓ కల. దానిని సాకారం చేసుకోవాలని పగలు..రేయి కష్టపడుతుంటారు. సంవత్సరాల పాటు పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. నిద్రాహారాలు మరిచి సాధనలో నిమగ్నమవుతుంటారు. అలా కష్టపడి మెగా డీఎస్సీలో ఎంపికై ఉద్యోగంలో చేరిన వారంతా విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నారు.
గురువులుగా ఉన్నందుకు గర్విస్తున్నామని.. భావి భారత పౌరులను తయారు చేసే బాధ్యతల్లో ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నామంటున్నారు. విధుల్లో చేరినప్పుడు కాస్త తడబడినా.. తరువాత తరగతి గదిలో చక్కగా రాణిస్తున్నారు.
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఐదేళ్లూ ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొట్టమొదటిసారిగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 16,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఆ విధంగా జిల్లావ్యాప్తంగా 578 మంది గత ఏడాది అక్టోబరు 13న విధుల్లో చేరారు. ఎన్నో ఏళ్ల శ్రమతో సాధించుకున్న కొలువులో ఆనందంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చేలా పనిచేస్తామంటున్నారు. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా ఇంగ్లీష్ 19, హిందీ 14, తెలుగు 12, జీవ శాస్త్రం19, గణితం 8, ఫిజికల్ ఎడ్యూకేషన్ 62, ఫిజికల్ సైన్సు 32, సోషల్ 58తో పాటు ఎస్‌జిటిలుగా 149 మంది చేరారు. మున్సిపల్ పరిధిలో స్కూల్ అసిస్టెంట్లుగా ఇంగ్లీష్ 4, తెలుగు 2, సోషల్ 2 పోస్టులతో పాటు ఎస్‌జిటిలు 47 పోస్టులు, సోషల్ రెండు, జీవ శాస్త్రం, ఫిజకల్ ఎడ్యూకేషన్ ఒక్కొక్కటి చొప్పున పోస్టులు భర్తీ అయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్‌లలో ఇంగ్లీష్ 7, జీవ శాస్త్రం 16, గణితం 25, ఫిజిక్స్ 24, సోషల్ 5, ఎస్‌జిటిలు 60 పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
మొదట్లో టెన్షన్ ఉండేది
ఉపాధ్యాయ విధుల్లో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. మొదట్లో విద్యార్ధులను ఆకట్టుకునేలా ఎలా బోధించాలనే టెన్షన్ ఉండేది. మిగిలిన ఉపాధ్యాయులను చూసి తెలుసుకు న్నాను. తాను సోషల్ అసిస్టెంట్ కావడంతో సోషల్ వల్ల ఉపయోగాలను విద్యార్థులకు వివరించాను. అన్ని పోటీ పరీక్షలకు సోషల్ చాలా ముఖ్యమని చెప్పడంతో విద్యార్థులంతా సోషల్‌ఫై దృష్టి పెట్టారు.
- పూసర్ల హేమలత, సోషల్ అసిస్టెంట్, గర్భాం పాఠశాల, మెరకముడిదాం .
సమాజంలో మంచి గుర్తింపు
రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ద్వారా 16000 మంది నిరుద్యోగుల జీవితాలు మారాయి. తాను ప్రైవేటు పాఠశాలల్లో పని చేశాను. పెద్దగా సంతృప్తి ఉండేది కాదు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేరాకే సమాజంలో మంచి గుర్తింపు వచ్చింది. బోధన ద్వారా చాలా మంది పిల్లలను బాగు చేస్తున్నందుకు గర్వంగా ఉంది. పాఠశాలకే రాని ఓ విద్యార్థిని ఆలోచనలో మార్పు తీసుకొచ్చి మంచి ఉత్తీర్ణతతో టెన్త్ పూర్తి చేయించాను.
- కోరాడ రామకృష్ణ, ఫిజిక్స్ అసిస్టెంట్, తూడెం పాఠశాల భోగాపురం
చాలా సంతోషంగా ఉంది
తాటిపూడి రిజర్వాయర్ ఆవల ఉన్న భీమవరం గిరిజన పాఠశాలలో పనిచేస్తున్నాను. రాళ్ల రోడ్డుపై వర్షాకాలంలో వెళ్తున్నప్పుడు ద్విచక్ర వాహనం జారిపోతుంటుంది. మొదట్లో కానిస్టేబుల్‌గా పని చేశా. డీఎస్సీలో ఎంపికై ఉపాధ్యాయుడుగా విధుల్లో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా బోధిస్తుంటాను.
దాసరి పైడినాయుడు, ఎస్‌జీటీ, భీమవరం పాఠశాల, గంట్యాడ
క్రీడలపై సాధన చేయిస్తున్నా..
డీఎస్సీ రాకముందు ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేశా. అక్కడ బాలికలతో పాటు బాలురు కూడా ఉన్నారు. బాలురుకు ఎలా క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి అనేదానిపై ప్రత్యేక దృష్టి పెట్టాను. చదువుతోపాటు క్రీడలు చాలా ముఖ్యమని వివరించాను. రానురాను క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. కొందరిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర పోటీలకు తీసుకువెళ్లాను.
- పడాల రమాదేవి, ఫిజికల్ డైరెక్టర్, తెర్లాం జడ్పీ పాఠశాల
టీచర్ వృత్తిలో అనందమే వేరు
ఉపాధ్యాయవృత్తి నా కల. 2018లో ప్రయత్నించి విఫలమయ్యాను. ఏడు సంవ్సతరాలపాటు బీసీ సంక్షేమ హాస్టల్ వార్డెన్‌గా పనిచేశాను. మొన్నటి డీఎస్సీలో విజయం సాధించి కల నెరవేర్చుకున్నాను. బోధన వృత్తిలో ఉన్నందుకు గర్వంగా ఉంది. బాల్యంలో స్కూలుకు వెళ్లిన రోజులు గుర్తుకొస్తుంటాయి. విద్యార్థులు మాస్టారు అని పిలుస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది.
- ఆల గణపతి, ఉపాధ్యాయుడు, గుర్ల పాఠశాల, మెంటాడ మండలం
విద్యాబుద్ధులు నేర్పడం గొప్ప అనుభూతి
ఆరు సంవత్సరాలపాటు పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాను. టీచర్ అవ్వాలని పట్టుదలను మాత్రం వీడలేదు. అదే ఈరోజు నన్ను పవిత్రమైన ఉపాధ్యావృత్తిలో నిలబెట్టింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం గొప్ప అనుభూతి. విద్యార్థులు గుడ్ మార్నింగ్ మేడం అనేసరికి నాలో కలిగే అనుభూతి గురించి మాటల్లో చెప్పలేను.
- వానపల్లి రమణమ్మ, టీచర్, బడేవలస, మెంటాడ మండలం.