కష్టపడి చదివి ఉపాధ్యాయులయ్యాం
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:31 PM
‘పదేళ్లపాటు ఎన్నో కోచింగ్ సెంటర్లకు వెళ్లాం. కష్టపడి చదివి ఉపాధ్యాయులయ్యాం. పోస్టుల కోసం ఎవరికీ లంచాలు ఇవ్వలేదు.
- ఎవరికీ లంచాలు ఇవ్వలేదు
- పారదర్శకంగానే డీఎస్సీ నిర్వహణ
- వైసీపీ విమర్శలు చేయడం చాలా బాధగా ఉంది
-మంత్రితో మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు
సాలూరు, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): ‘పదేళ్లపాటు ఎన్నో కోచింగ్ సెంటర్లకు వెళ్లాం. కష్టపడి చదివి ఉపాధ్యాయులయ్యాం. పోస్టుల కోసం ఎవరికీ లంచాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీని నిర్వహించింది. మెరిట్ ఆధారంగానే పోస్టులను కేటాయించింది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. వైసీసీ చేస్తున్న ఆరోపణలు నిరాధారం. వాటిని చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది.’ అని మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన పట్టణానికి చెందిన కోట ప్రవీణ్, ఉంగరాల కవిత అన్నారు. గురువారం వారి ఇళ్లకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా తమ ఆవేదనను మంత్రి ఎదుట చెప్పుకున్నారు. ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయ పోస్టు కోసం పదేళ్లపాటు కష్టపడ్డాను. అవనిగడ్డ, ఇతర కోచింగ్ సెంటర్లకు తిరిగా. నిరంతరం శ్రమించి మెగా డీఎస్సీలో విజయం సాధించా. 2018లో కొద్దిపాటి మార్కుల ద్వారా ఉపాధ్యాయ వృత్తికి దూరమయ్యా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహించింది. మెరిట్, రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా ఎలా అన్నింట్లో పారదర్శకత పాటించింది. ఈ ప్రయత్నంలో నేను విజయం సాధించా.’అని తెలిపారు. కవిత మాట్లాడుతూ.. ‘మా తల్లిదండ్రులు రోజుకూలీలు. మేము నలుగురు ఆడపిల్లల సంతానం. మూడోదానినైనా నేను ఏడేళ్లపాటు ఎంతో కష్టపడి చదివి ఉపాధ్యాయ వృత్తికి ఎంపికయ్యా. లంచాలు ఇచ్చే స్థాయిలో మా తల్లిదండ్రులు లేరు. అలా లంచాలు ఇచ్చే పరిస్థితే ఉంటే 2018లో కేవలం అర మార్కుతో ఉపాధ్యాయ ఉద్యోగానికి దూరమయ్యేదానిని కాదు. శ్రమించి ఉద్యోగం సాధిస్తే అవినీతితో ఎంపికయ్యారని వైసీపీ విమర్శలు చేస్తుంటే చాలా బాధగా ఉంది.’అని మంత్రి ఎదుట భావోద్వేగానికి గురైంది. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని జగన్ ఈ రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం చాలా దారుణమన్నారు. కష్టపడి ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదిస్తే వారిని ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. లకు తెలిపారు. అనంతరం సాలూరు మున్సిపల్ కార్యాలయంలో టిడ్కో గృహాలు మంజూరుకాని 80 మందికి రూ.27 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, డిప్యూటీ డీఈవో రాజ్‌కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.