డీఎస్సీని పార దర్శకంగా నిర్వహించాం
ABN , Publish Date - May 30 , 2026 | 12:40 AM
‘మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహించింది. ప్రభుత్వానికి మంచిపేరు రావడంతో వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
తట్టుకోలేక వైసీపీ బురద జల్లుతుంది
గత ప్రభుత్వంలో జరిగిన గ్రూప్-1 పరిస్థితి ఏంటి?
జూలైలో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
మంత్రి కొండపల్లి
విజయనగరం, మే 29 (ఆంధ్రజ్యోతి): ‘మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహించింది. ప్రభుత్వానికి మంచిపేరు రావడంతో వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీని నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. దీనిపై నిరుద్యోగులు ఎంతో సంతోషించారని అన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష అనంతరం జరిగిన అవకతవకలు గురించి రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు. ఈ పరీక్ష పేపర్లను ప్రైవేటు రిసార్టులో దిద్దారు. దీనివల్ల ఆ పరీక్షల్లో విజయం సాధించిన వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. గత పాలకుల నిర్వహకం వల్లే గ్రూప్-1 అధికారుల భవిష్యత్తు అయోమయంలో పడింది. ఇటువంటివన్నీ వారి హయాంలో చేసి, కూటమి హయాంలో పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై బురదజల్లడం సబబు కాదు. జూన్ 1 నుంచి విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. రైల్వే జోన్ కల సాకారం చేసిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తికావచ్చాయి. జూలై తొలి వారంలో ప్రధాని మోదీ ఇవ్వనున్న తేదీ ప్రకారం ఎయిర్ పోర్టు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కనెక్టవిటీ రోడ్లు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ విమానాశ్రయం ప్రారంభమైతే, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎయిర్‌పోర్టుతో పాటు గుర్లలో ఏర్పాటు కానున్న స్టీల్ ప్లాంట్, ఇలా పలు ప్రాంతాల్లో ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూ సమీకరణ విషయంలో రైతులకు శతశాతం న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. త్వరలో వితంతు పెన్షన్‌లు ఇచ్చే ఆలోచన ఉంది. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు జిల్లాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను పర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ నెల 27, 28 తేదీల్లో పర్చువల్ విధానంలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు విజయవంతం అయింది. కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి కోసం టీడీపీ కృషి చేస్తుంది. 2029 ఎన్నికల్లో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు నారా లోకేష్ ప్రకటించడం హర్షణీయం. జిల్లాలో మహానాడు విజయవంతానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు’. అని అన్నారు.