రుణాల వసూళ్లపై దృష్టి సారించాం
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:53 PM
జిల్లాలో స్త్రీనిధి రుణాల వసూళ్లపై పూర్తిస్థాయి దృష్టి సారించామని స్త్రీనిధి ఏరియా జనరల్ మేనేజర్ పి.కామరాజు తెలిపారు.
జియ్యమ్మవలస, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్త్రీనిధి రుణాల వసూళ్లపై పూర్తిస్థాయి దృష్టి సారించామని స్త్రీనిధి ఏరియా జనరల్ మేనేజర్ పి.కామరాజు తెలిపారు. శుక్రవారం చినమేరంగి దళితవాడలో మహిళా సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి తీసుకున్న స్త్రీనిధి రుణాల్లో తిరిగి మహిళా సంఘాలు నుంచి రూ. 1.05 కోట్లు బకాయిలు వసూళ్లు చేయాల్సిఉందని చెప్పారు. ఇందులో ఒక్క జియ్యమ్మవలస మండలంలోనే రూ. 35 లక్షలు రావల్సి ఉందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 24 గ్రామ సంఘాల పరిధిలో 89 మంది మహిళల నుంచి వసూళ్లు చేయాల్సి ఉందన్నారు. వసూళ్లు విషయంలో రాజీపడబోమని తేల్చిచెప్పారు. ఈనెల రూ.20 లక్షలు వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇటీవల భామిని మండలంలోని నేరేడి గ్రామ వీవోఏ రూ. 13 లక్షలకు సంబంధించి లెక్కలు చెప్పకపోవడంతోఆమెపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశామని, ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని గుర్తు చేశారు. గతంలో రికవరీ పరిస్థితి 85 శాతం ఉండగా, డిజిటల్ పేమెంట్లు వచ్చిన తరువాత రికవరీ 93 శాతం నుంచి 95 శాతానికి చేరిందని చెప్పారు. అయితే డిజిటల్ పేమెంట్ల ద్వారా మహిళా సంఘాల్లో సభ్యులు ఒకేసారి కట్టకపోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నారు. ఆయన వెంట స్త్రీనిధి మేనేజర్ టి.ఉదయ్, సీసీ సీతమ్మ, వీవోఏ రోహిణి, మహిళా సంఘ సభ్యులు ఉన్నారు.