తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:35 PM
ఆర్నబ్ తుఫాన్‌ను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందని, ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పాచిపెంట రూరల్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్‌ను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందని, ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పెద్దగెడ్డ జలాశయాన్ని ఆయన సందర్శించారు. జలాశయ గేట్ల స్థితిగతులపై ఆరా తీశారు. జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వలు, రెండో గేటులో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో అన్ని జలాశయాల్లో జలకళ సతంతరించుకుందన్నారు. 83 విద్యుత్ స్తంభాలు నేలవాలయన్నారు. రెండు రోడ్లు పూర్తిగా దెబ్బతింటే, ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కూలిన చెట్లను కూడా ఎక్కడికక్కడ సకాలంలో తొలగించినట్లు చెప్పారు. నాలుగు కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తుండడంతో ప్రజల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు. 2027 నాటికి డోలి మోతల గ్రామాలకు రోడ్ల ఏర్పాటుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ సచిన్ రహర్ ఉన్నారు.
ముంపు తగ్గిన వెంటనే పంట నష్టాల అంచనా
సీతానగరం (బలిజిపేట), అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): బలిజిపేట మండలంలోని వంతరాం, నూకలవాడ గ్రామాల్లో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముంపు పూర్తిగా తగ్గిన వెంటనే పంటల నష్టాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అంచనా వేయాలని, అర్హులైన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు త్వరితగతిన అందించాలని స్పష్టం చేశారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని, బ్లీచింగ్ చల్లడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సచిన్ రహర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.