కొనలేం.. తినలేం
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:53 PM
నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వాటి ధరలు పైపైకి వెళ్తున్నాయి.
-కొండెక్కిన నిత్యావసరాల ధరలు
- 25 కిలోల సన్న బియ్యం బస్తా రూ.1700
- నూనె ప్యాకెట్ రూ.155.. కిలో పంచదార రూ.70
- ఉల్లిపాయలు, కూరగాయలు రేట్లు కూడా ఇంతే
- సామాన్య, మధ్యతరగతి ప్రజల బెంబేలు
పార్వతీపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వాటి ధరలు పైపైకి వెళ్తున్నాయి. బియ్యం, నూనె, పంచదార, ఉల్లిపాయలు, కూరగాయలు ఇలా ఏది కొనాలన్నా ధర అందుబాటులో లేకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఏం కొనలేం.. ఏం తినలేం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. నెల రోజుల కిందట ఒక బ్రాండ్‌కు చెందిన 25 కిలోల సన్న బియ్యం బస్తా రూ.1500 ఉండేది. ఇప్పుడు రూ.1700 పలుకుతోంది. మరొక బ్రాండ్‌కు చెందిన సన్న బియ్యం రూ.1500 నుంచి రూ.1650కు పెరిగింది. నెల రోజుల్లోనే బియ్యం బస్తాపై రూ.150 నుంచి రూ.200 వరకు ధర పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రిఫండ్ ఆయిల్ ధరలు కూడా మండుతున్నాయి. గత నెలలో రూ.145 ఉన్న 850 గ్రాముల ఆయిల్ ప్యాకెట్ ధర ఇప్పుడు రూ.155కు చేరింది. ప్యాకెట్‌పై 850 గ్రాములు అని ముద్రించి ఉన్నప్పటికీ కిలో ప్యాకెట్‌గానే భావించి వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అదే విధంగా వారం రోజుల కిందట పంచదార కిలో రూ.52 ఉండగా, ప్రస్తుతం రూ.70 పలుకుతోంది. జిల్లాలో ఒకవైపు చక్కెర కర్మాగారాలు మూతపడుతుంటే మరోవైపు చక్కెర ధరలు పరుగులు పెడుతుండడం గమనార్హం. ఉల్లిపాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. మొన్నటి వరకూ వంద రూపాయలకు ఐదు కిలోలు అంటూ వ్యాపారులు వీధివీధికి ఆటోల్లో తిరుగుతూ విక్రయించేవారు. ఇప్పుడు కిలో రూ.50కు చేరింది. దీంతో ఉల్లిపాయలు కొనుగోలు చేస్తే కన్నీరు వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. పచ్చిమిర్చి రూ.50, బీరకాయ రూ.50, ఆకారకాయ రూ.160, టమాటా, బెండ, దొండ రూ.30, బీన్స్ రూ.150, క్యారెట్, బీట్‌రూట్ తెల్లవంకాయలు రూ.50, అల్లం రూ.120 పలుకుతున్నాయి. మరోవైపు ఆకుకూరలు, కొత్తిమీర ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.
మొక్కుబడిగా ధరల పట్టిక..
దుకాణాల వద్ద ధరల పట్టిక మొక్కుబడిగానే ఉంటుంది. సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే గానీ స్పందించడం లేదు. పత్రికల్లో వార్తలు వస్తే హడావుడి చేస్తున్నారు. అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదు. బియ్యం వంటి సరుకులను కొనుగోలు చేస్తే బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
ధరలను అదుపు చేయాలి
బియ్యం ధరలతో పాటు వంట నూనె, పంచదార ధరలు గత కొన్ని నెలలుగా పెరుగుతున్నాయి. దీనివల్ల వినియోగదారులు అదనపు ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోంది. ధరలు అదుపులో ఉండే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
- అప్పలనాయుడు, వినియోగదారుడు, పార్వతీపురం