Share News

We Cannot Accommodate Here! ఇక్కడ చేర్చుకోలేం!

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:16 AM

We Cannot Accommodate Here! గుమ్మలక్ష్మీపురం గిరిజన గర్భిణుల వసతిగృహం ఇక మూతబడినట్లేనా..? అంటే ప్రస్తుత సిబ్బంది సమాధానం చూస్తుంటే అదే నిజమని తెలుస్తోంది. సోమవారం బీరుపాడు పంచాయతీ వాడజంగి కొండ శిఖర గ్రామానికి చెందిన గువ్వల గంగో త్రి, కిల్లక మహంతి అనే ఇరువురు గిరిజన గర్భిణులు దుడ్డుఖళ్లు పీహెచ్‌సీ నుంచి గుమ్మ లక్ష్మీపురం వసతిగృహానికి వచ్చారు. అయితే ఇక్కడ చేర్చుకోలేమని సిబ్బంది చెప్పారు.

We Cannot Accommodate Here!  ఇక్కడ చేర్చుకోలేం!
గుమ్మలక్ష్మీపురంలో గిరిజన గర్భిణుల వసతిగృహం

  • నిరాశతో వెనుదిరుగుతున్న గర్భిణులు

  • ఇక మూతపడినట్లేనా..?

గుమ్మలక్ష్మీపురం, జూన్‌23(ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం గిరిజన గర్భిణుల వసతిగృహం ఇక మూతబడినట్లేనా..? అంటే ప్రస్తుత సిబ్బంది సమాధానం చూస్తుంటే అదే నిజమని తెలుస్తోంది. సోమవారం బీరుపాడు పంచాయతీ వాడజంగి కొండ శిఖర గ్రామానికి చెందిన గువ్వల గంగో త్రి, కిల్లక మహంతి అనే ఇరువురు గిరిజన గర్భిణులు దుడ్డుఖళ్లు పీహెచ్‌సీ నుంచి గుమ్మ లక్ష్మీపురం వసతిగృహానికి వచ్చారు. అయితే ఇక్కడ చేర్చుకోలేమని సిబ్బంది చెప్పారు. గర్భిణులు, వారి బంధువులు వసతిగృహ సిబ్బందితో వాదనకు దిగినా ఫలితం లేకపోయింది. చివరకు గర్భిణులు నిరాశతో వెనుదిరిగారు. దీనిపై వసతిగృహం ఏఎన్‌ఎం రమావతిని వివరణ కోరగా... ‘ ఇక ముందు ఈ వసతిగృహంలో గర్భిణులను చేర్చుకోవద్దని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి ఆదేశించారు.’ అని తెలిపారు.

గిరిశిఖర గ్రామాల్లో మాతాశిశు మరణాలు నియంత్రించాలనే లక్ష్యంతో 2016, జూలైలో గుమ్మలక్ష్మీపురం వైటీసీలో గర్భిణుల వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ గర్భిణులకు పౌష్టికాహారం అందించి.. వైద్య పరీక్షలు జరిపేవారు. ప్రసవ సమయంలో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గడంతో ఇది దేశంలోనే మోడల్‌గా నిలిచింది. ఆ తర్వాత జిల్లాలోని సాలూరు, సీతంపేట వైటీసీల్లో వసతిగృహం ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల పాటు అవి బాగానే నడిచినా.. వైసీపీ సర్కారు హయాంలో గాడి తప్పాయి. వాటి నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. సిబ్బందికి జీతాలు కూడా సకాలంలో చెల్లించలేక పోయింది. దీంతో పూర్తిస్థాయిలో సేవలందక గిరిజన గర్భిణులు వసతిగృహాలకు వచ్చేందుకు ఆసక్తి చూపేవారు కాదు. ఈ క్రమంలో సాలూరులో వసతిగృహం మూతపడింది. అయితే కూటమి ప్రభుత్వం సాలూరు ప్రభుత్వాసుపత్రిలో గిరిజన గర్భిణుల కోసం బర్త్‌ వేయిటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేసింది. ఇక సీతంపేట వసతిగృహంలో 15 మంది వరకూ గర్భిణులు ఉన్నారు. కాగా గుమ్మలక్ష్మీపురంలో ప్రత్యామ్నాయ చర్యలేవీ చేపట్టకుండా వసతి గృహ ంలో గర్భిణులను చేర్చుకోక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Jun 24 , 2026 | 12:16 AM