మనం ప్రజా సేవకులం
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:26 PM
‘మనమంతా ప్రజా సేవకులం. సమస్యలపై ప్రజల నుంచి ప్రతి అర్జీని స్వీకరించి నిర్ణీత కాలంలో పరిష్కరించేలా కృషి చేయాలి.’ అని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ప్రతి అర్జీని స్వీకరించి పరిష్కరించాలి
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురంటౌన్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘మనమంతా ప్రజా సేవకులం. సమస్యలపై ప్రజల నుంచి ప్రతి అర్జీని స్వీకరించి నిర్ణీత కాలంలో పరిష్కరించేలా కృషి చేయాలి.’ అని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో ప్రజల ముంగిటకే కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరచాలని, కాలువల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని, తాగునీటి సరఫరా సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పింఛన్‌లు, రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా అర్హత ఉన్నవారికి న్యాయం చేయాలన్నారు. ప్రజలు పదే పదే ఒకే సమస్యపై వినతులు ఇవ్వాల్సిన అవసరం రాకూడదని, క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రను బట్టి అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలన్నారు. కాలువల ర్మాణం చేపట్టాలని పార్వతీపురం కొత్తవలసకు చెందిన బోనం దుర్గాప్రసాద్, తనకు రేషన్ కార్డును మంజూరు చేయాలని కొత్తవీధికి చెందిన కె.యోగేశ్వరీ, 24వ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాలని ముద్దాల వీధికి చెందిన పాకల సన్యాసిరావు కలెక్టర్‌కు వినతులు అందించారు. ఇంటి పన్ను ఎసెస్‌మెంట్‌కు సంబంధించి న్యాయం చేయాలని పార్వతీపురం కొత్తవలస రాజీవ్ కాలనీకి చెందిన వి.ప్రవీణ్, జగన్నాథపురం పాత్రుడి కోనేరును అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్, కల్యాణ మండపం నిర్మించాలని ఆర్‌వీ ప్రసాద్..కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ బి. గౌరీశ్వరీ, కమిషనర్ డి.పావని, డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారి ఎం.సుధారాణి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.