Share News

We Are First in Teaching బోధనలో మనమే ఫస్ట్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:33 PM

We Are First in Teaching విద్యా బోధనలో జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. పాఠశాల పిల్లలకు పాఠాలు బోధించడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మధ్యాహ్నం భోజనం రుచిలోనూ ఒకటో స్థానం దక్కించుకుంది. ఇటీవల మంత్రులు, హెచ్‌వోడీలతో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమవేశంలో ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ మేరకు మధ్యాహ్న భోజనం నాణ్యతలో మన్యం మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు.

We Are First in Teaching బోధనలో మనమే ఫస్ట్‌
గరుగుబిల్లి జడ్పీ హై స్కూల్‌లో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

  • టీచర్ల సమయపాలనలో 11వ స్థానం

  • ఆహార నాణ్యతలో మూడో స్థానం

  • ఇటీవల ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం

పార్వతీపురం,ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి): విద్యా బోధనలో జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. పాఠశాల పిల్లలకు పాఠాలు బోధించడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మధ్యాహ్నం భోజనం రుచిలోనూ ఒకటో స్థానం దక్కించుకుంది. ఇటీవల మంత్రులు, హెచ్‌వోడీలతో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమవేశంలో ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ మేరకు మధ్యాహ్న భోజనం నాణ్యతలో మన్యం మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్న విషయంలో మాత్రం జిల్లాకు 11వ స్థానం లభిం చింది. పిల్లలకు పాఠాలు సక్రమంగా అర్థమవుతున్నాయా? అనే అంశంలో ఆరో స్థానం దక్కింది. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు విషయంలో జిల్లా నాలుగో స్థానం, అన్నం నాణ్యత లో ఆరో స్థానంలో నిలిచింది. మిగిలిన అంశాల్లో జిల్లా విద్యాశాఖ వెనుకబడి ఉండడానికి కారణా లను కూడా ప్రభుత్వం గుర్తించి.. పనితీరు మెరుగుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం గుర్తించిన అంశాలు..

జిల్లాలో అధికంగా ఉన్న గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం, రహదారులు లేకపోవడమే ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు రాలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మల్టీ గ్రేడ్‌ బోధన కొన సాగుతున్నట్లు తెలుసుకుంది. మరికొన్ని పాఠశాలల్లో పాత భవనాలు, గిరిజన ప్రాంతల్లోని బడుల్లో మౌలిక వసతులు కొరవడినట్లు తేలింది. ఫస్ట్‌ జనరేషన్‌ లెర్నర్స్‌ అధికంగా ఉండడంతో పాటు గిరిపుత్రులకు భాష అవరోధాలు ఉన్నాయి. రవాణా సదుపాయం లేకపోవడం వల్ల మారుమూల ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన సరుకుల సరఫరా జాప్యమవుతోంది. అదే విధంగా వంట సిబ్బంది మార్పులు, స్థానిక రుచులకు అనుగుణంగా తయారీలో లోపం ఉంది. నిల్వ సమ యంలో వంట సరుకులు పాడవుతుండగా.. బియ్యంలో నాణ్యత లోపం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

తీసుకోవాల్సిన చర్యలు..

- ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రావాలంటే స్థానికంగా నివాసం ఉండాలి. బయోమెట్రిక్‌ హాజరు విషయంలో కఠినంగా వ్యవహరించాలి. మండల విద్యాశాఖాధికారులు తరచూ పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేయాలని ప్రభుత్వం సూచించింది.

- బోధనకు సంబంధించి క్లస్టర్‌ స్థాయిలో సబ్జెక్టు టీచర్ల సమన్వయం, ఆన్‌లైన్‌, అదే విధంగా డిజిటల్‌ కంటెంట్‌ వినియోగం మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది.

- భద్రతా చర్యల నడుమ పాఠశాలల గదుల మరమ్మతులు, మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాల్సి ఉంది.

- మాతృభాషా ఆధారిత బోధనపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.

- మధ్యాహ్న భోజనంలో మెనూ అమలు, సరుకుల సరఫరాలో షెడ్యూల్‌ కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. అదే విధంగా వంట సిబ్బందికి శిక్షణ, రేషన్‌ సరఫరాలో తనిఖీలు, సరుకుల నాణ్యత చూసుకోవాలని, సరుకుల సరఫరాదారులపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

- ‘విద్యాబోధన, మధ్యాహ్న భోజన పథకం అమలులో మన్యం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగిలిన అంశాల్లోనూ జిల్లా స్థానం మెరుగు పర్చడానికి కృషి చేస్తాం. ’ డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు.

Updated Date - Feb 18 , 2026 | 11:33 PM