VRS వీఆర్‌ఎస్ వెలవెల
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:34 PM
Water Scarcity Leaves VRS Dry జలకళ లేక వెంగళరాయసాగర్(వీఆర్‌ఎస్) ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు జిల్లాలోనూ వర్షాలు కురవకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన తూముల ద్వారా నీరు భారీగా లీకై వృథాగా పోతోంది.
మరోవైపు తూముల ద్వారా లీకులు
ప్రశ్నార్థకంగా ఖరీఫ్ సాగు
ఆందోళనలో మూడు మండలాల రైతులు
మక్కువ, జూలై14(ఆంధ్రజ్యోతి): జలకళ లేక వెంగళరాయసాగర్(వీఆర్‌ఎస్) ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు జిల్లాలోనూ వర్షాలు కురవకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన తూముల ద్వారా నీరు భారీగా లీకై వృథాగా పోతోంది. మొత్తంగా 161 మీటర్ల నీటి సామర్థ్యం కలిగిన జలాశయంలో నేడు 155 మీటర్ల కన్నా తక్కువ స్థాయిలోనే నిల్వలు ఉన్నాయి. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. మన్యం జిల్లాలో మక్కువ, సీతానగరంతో పాటు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు మండలాల్లో సుమారు 24,700ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడమే కష్టమేనని వారు వాపోతున్నారు. గత నెలలో జిల్లాలో సాధా రణం కంటే అతి తక్కువ స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. మొదటివారంలో కొద్దిపాటి వాన పడడంతో వరి నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. అయితే గత గత పది రోజులుగా వర్షం కురవకపోవడం వల్ల నారుమళ్లు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు పడకపోతే తీవ్రనష్టం తప్పదని వాపోతున్నారు.
వాస్తవంగా గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 158 నుంచి 160 మీటర్ల వరకు నీటినిల్వలు ఉన్నాయి. అయితే ఈ ఏడాదిలో ఇప్పటివరకు కనీస స్థాయిలో నీటిమట్టం పెరగలేదు. వీఆర్‌ఎస్‌కు అనుసంధానించే గోముఖ రిజర్వాయర్‌లో కూడా తగినంత చేరలేదు. దీంతో ప్రాజెక్టు పరిధిలో రైతులకు ఏం చేయాలో తోచడం లేదు.
ఏటా ఆగస్టు మొదటి వారంలో వెంగళరాయసాగర్ నుంచి అధికారులు సాగునీటిని విడుదల చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఇంతవరకు ప్రాజెక్టులో కనీసం నిల్వలు చేరలేదు. రానున్న 15రోజుల్లో వర్షాలు పడితేనే ఖరీఫ్ రైతుల ఆశలు ఫలిస్తాయి. లేకుంటే సాగు కష్టమే. గత ఏడాది ఇదే సమయానికి 35శాతం వరకు వరినాట్లు పడగా ఈ ఏడాది ఇంతవరకు బోర్లు ఉన్నవారు తప్ప ఏ గ్రామంలో కూడా పూర్తిస్థాయిలో వరి నాట్లు పడలేదు. దీనిపై వీఆర్‌ఎస్ ప్రాజెక్టు డీఈ సురేష్‌ను వివరణ కోరగా.. వర్షాలు పడకపోవడంతో జలాశయంలో ఇన్‌ఫ్లో తగ్గిందన్నారు. ప్రధాన తూముల ద్వారా లీకైన నీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.