VRS Reservoir వీఆర్‌ఎస్ నుంచి నీరు విడుదల
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:26 PM
Water Released from VRS Reservoir ఖరీఫ్ పంటల కోసం శుక్రవారం వెంగళరాయసాగర్ నుంచి సాగునీరు విడుదల చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నా.. రైతుల అభ్యర్థనల మేరకు నీటిని సరఫరా చేశారు.
మక్కువ, ఆగస్టు7(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ పంటల కోసం శుక్రవారం వెంగళరాయసాగర్ నుంచి సాగునీరు విడుదల చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నా.. రైతుల అభ్యర్థనల మేరకు నీటిని సరఫరా చేశారు. వాస్తవంగా వీఆర్‌ఎస్ నుంచి మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాల్లో 24,700 ఎకరాలకు నీరందాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ క్రమంలో జలాశయంలో 161 మీటర్లకు గాను 156.2 మీటర్ల వరకే నీటి నిల్వలు ఉన్నాయి. మరో మూడు రోజుల్లో ఖరీఫ్ సాగుకు నీరందించాలని అధికారులు అనుకున్నారు. అయితే ఈ లోపుగా రైతులు ఒత్తిడి చేయడంతో అధికారులు ప్రాజె క్టులోని నీటిసంఘాల అధ్యక్షులతో చర్చించి ఎట్టకేలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భగా డీఈ సురేష్ మాట్లాడుతూ.. వీఆర్‌ఎస్ కుడి ప్రధానకాలువ ద్వారా 150 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 50 క్యూసెక్కులను విడుదల చేశామన్నారు. వర్షాలు పూర్తిస్థాయిలో కురిస్తే ఖరీఫ్ సాగుకు ఢోకా ఉండదన్నారు. ప్రస్తుత పరిస్థితితే కొనసాగితే మాత్రం ప్రాజెక్టులో ఉన్న నీరు 25రోజుల వరకే సరఫరా అవుతుందని వెల్లడించారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలనే వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాలనాయుడు, ప్రాజెక్టు చైర్మన్ గోదావరి, వైస్ చైర్మన్ సత్యం, నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.