Water Released నీరు విడుదల సరే.. శివారుకు అందేనా?
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:39 PM
Water Released, But Will It Reach the Tail-End Areas? రావాడ గ్రామంలో ఉన్న వట్టిగెడ్డ రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్‌కి చేరింది. 0.98 టీఎంసీలకు గాను 0.25 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ ఖరీఫ్ పంటల కోసం బుధవారం ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి చేతుల మీదుగా నీరు విడుదల చేశారు.
అయినప్పటికీ నీరు విడుదల
ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటున్న అధికారులు
జియ్యమ్మవలస, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): రావాడ గ్రామంలో ఉన్న వట్టిగెడ్డ రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్‌కి చేరింది. 0.98 టీఎంసీలకు గాను 0.25 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ ఖరీఫ్ పంటల కోసం బుధవారం ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి చేతుల మీదుగా నీరు విడుదల చేశారు. అయితే జలాశయంలో నీటి నిల్వలను చూసి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులో నిల్వలు ఉన్న మేరకు అధికారులు సాగునీరందిస్తారని వెల్లడించారు. ఏదేమైనా ఈ ఏడాదిలో రైతులంతా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మేలని నీటి పారుదలశాఖ ఏఈ శంకరరావు సూచించారు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు నుంచి జియ్యమ్మవలస, గరుగుబిల్లిలో సుమారు 16,784 ఎకరాలకు నీరందాల్సి ఉంది. అయితే నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో శివారు ప్రాంత ఆయకట్టుదారులు ఆందోళన చెందు తున్నారు. ఖరీఫ్ సాగుపై టెన్షన్ పడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, ఎంపీపీ బొంగు సురేష్, అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.