Water planning in four steps నాలుగంచెల్లో నీటి ప్రణాళిక
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:51 PM
Water planning in four steps భూగర్భ, ఉపరితల నీటిమట్టం పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. జలధార పేరుతో ఆ పనులు చేపట్టాలని ఆదేశిస్తూ జీవో నంబర్ 10 విడుదల చేసింది.
నాలుగంచెల్లో నీటి ప్రణాళిక
భూగర్భ నీటి మట్టాల పెంపునకు ప్రభుత్వం చర్యలు
వందరోజుల కార్యాచరణకు ఆదేశం
రేపటి నుంచి జలధార
కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధుల సమీకరణ
బొబ్బిలి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి):
భూగర్భ, ఉపరితల నీటిమట్టం పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. జలధార పేరుతో ఆ పనులు చేపట్టాలని ఆదేశిస్తూ జీవో నంబర్ 10 విడుదల చేసింది. ఈ నెల ఆరు నుంచే నాలుగు అంచెల్లో ఆయా పనులు చేపట్టాలని నిర్దేశించింది. ఈ ప్రక్రియలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మొదట ఈ నెల 6 నుంచి 15 వరకు మైనర్ ఇరిగేషన్ పరిధిలో నీటి వనరులను గుర్తించి వాటికి చేయాల్సిన పనులను నమోదు చేస్తారు. రెండో విడతలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు ఆ పనుల మంజూరు ప్రక్రియ ఉంటుంది. ఆపై మూడో విడతలో ఈ నెల 21 నుంచి జూన్ 9 వరకు 80 రోజుల పాటు ఎంపిక చేసిన పనుల నిర్వహణ చేపడ్తారు. చివరిగా నాలుగో విడతలో జూన్ 10 నుంచి 14 వరకు ఈ పనుల ప్రగతికి సంబంధించిన నివేదికలను అధికారులు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.
మారుతున్న వాతావరణ పరిస్థితులు ఆందోళనకరంగా, ప్రతికూలంగా ఉంటున్న నేపథ్యంలో తాగు, సాగునీటి ఎద్దడి మామూలైపోయింది. భూగర్భజలాలు కనీసం 15 మీటర్లు ఉండాలి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రకారం భూగర్భజలాలను కనీసం ఒక మీటరైనా పెంచాలన్న లక్ష్యంతో సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ తంతులో సాగునీటి సంఘాల ప్రతినిధులు, గ్రామపంచాయతీలు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనేలా ప్రభుత్వం నిర్దేశించింది.
ఏఏ పనులు చేయాలి
మైనర్ ఇరిగేషన్ పరిధిలో ఉండే చెరువులు, ఫీడర్ చానళ్ల పునరుద్ధరణ, చెరువు గట్ల పటిష్టం, చెరువుల అనుసంధానం, పచ్చదనం పెంపు, వర్షం.. వరద నీటి సంరక్షణ తదితర పనులు చేపడ్తారు. పర్యవేక్షణకు గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు.
- పనుల ప్రక్రియలో ప్రగతికి సంబంధించి జియోట్యాగింగ్ ఉంటుంది. ఫొటోలు అప్‌లోడ్ చేసేందుకు ప్రత్యేక యాప్‌ను కూడా తీసుకొచ్చారు. గ్రామసభల ద్వారా పనులను గుర్తించి మండల కమిటీ సిఫారసుతో కలెక్టర్ అనుమతి పొందాలి. వీబీజీ రామ్‌జీ, జలశక్తి అభియాన్ వంటి కేంద్ర ప్రభుత్వాల పథకాలతో ఈ పనులు చేపడ్తారు.
వందరోజుల ప్రణాళిక అమలుకు సిద్ధం
ఆర్.అప్పారావు, ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ, బొబ్బిలి
భూగర్భ, ఉపరితల నీటి మట్టాలను పెంచే లక్ష్యంతో నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో వందరోజుల కార్యాచరణకు ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై కలెక్టర్ శనివారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి లక్ష్యాలను వివరించారు. ఆ మేరకు సాగునీటి సంఘాలను క్రియాశీలం చేస్తాం. ఏ స్ధాయిలో కూడా సాగునీటి కొరత లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
------------------