Share News

water kits not use నాణ్యత పరీక్షలు ‘నీటి’ మూటలేనా...!

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:20 AM

water kits not use గ్రామాల్లో సరఫరా అవుతున్న తాగునీరు సురక్షితమేనా.. పైపులైన్లు బాగున్నాయా.. వాటర్‌ ట్యాంకర్‌ను శుభ్రం చేస్తున్నారా.. నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన ఉందా.. సిబ్బంది ఎప్పుడైనా అవగాహన పరిచారా.. అసలు నీటి నాణ్యతను ఎప్పుడైనా పరీక్షించారా.. ప్రభుత్వం వచ్చిన కిట్‌లను వినియోగిస్తున్నారా.. ఈ ప్రశ్నలకు లేనే లేదు అన్న సమాధానమే వినిపిస్తోంది.

 water kits not use నాణ్యత పరీక్షలు  ‘నీటి’ మూటలేనా...!
నీటి పరీక్షలకు ఉపయోగించే కిట్‌

నాణ్యత పరీక్షలు

‘నీటి’ మూటలేనా...!

పరికరాలున్నా వినియోగించని సిబ్బంది

సచివాలయాల భవనాలకే పరిమిత మైన కిట్‌లు

ప్రజలకూ అవగాహన కరువు

ఏవైనా ఘటనలు జరిగినప్పుడే అధికారుల హడావిడి

గ్రామాల్లో సరఫరా అవుతున్న తాగునీరు సురక్షితమేనా.. పైపులైన్లు బాగున్నాయా.. వాటర్‌ ట్యాంకర్‌ను శుభ్రం చేస్తున్నారా.. నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన ఉందా.. సిబ్బంది ఎప్పుడైనా అవగాహన పరిచారా.. అసలు నీటి నాణ్యతను ఎప్పుడైనా పరీక్షించారా.. ప్రభుత్వం వచ్చిన కిట్‌లను వినియోగిస్తున్నారా.. ఈ ప్రశ్నలకు లేనే లేదు అన్న సమాధానమే వినిపిస్తోంది.

సచివాలయ భవనాల్లో నీటి నాణ్యతను పరీక్షించే కిట్‌లు ఓ మూలన పడి ఉంటున్నాయి. ఇలా అయితే ప్రజారోగ్యం ఎలా అనేది అధికారులు, సిబ్బంది ఆలోచించాలి.

గజపతినగరం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి):

పురిటిపెంట గ్రామంలో కలుషిత నీరు సరఫరా కావడంతో ఆ గ్రామస్థులు కొద్దిరోజుల కిందట తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పైపులైన్లు లీక్‌ కావడంతో బురద నీరు సరఫరా అయింది. అప్రమత్తం కావడంతో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇలాంటి సమస్య అనేక గ్రామాల్లో తరచూ తలెత్తుతోంది. అలాగే వాటర్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఈ నీరు తాగి డయేరియా బారిన పడిన ఘటనలు కోకొల్లలు. గ్రామాల్లో తాగునీటి ద్వారా అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎప్పటికప్పుడు తాగునీటిని పరీక్షించి ఆ తరువాత సరఫరా చేయాలి. అందుకు అవసరమైన పరికరాలను కేంద్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు అందజేసింది. తాగునీటి నాణ్యత పరీక్షల్లో అలసత్వం వహించవద్దని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అయినా నాణ్యత పరీక్షల విషయంలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పరీక్షలు సమగ్రంగా జరగడం లేదు. సచివాలయాల్లో పరికరాలు మూలనపడి ఉంటున్నాయని, ఏ రోజూ పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

తాగునీటి ద్వారా 80 రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. తాగుతున్న నీరు సురక్షితమేనా ? నాణ్యతను నిర్ధారించే పరీక్షలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా అనేదానిపై పర్యవేక్షణ లేదు. అంతా సవ్యంగా ఉన్నట్లు సచివాలయాలు చూపుతున్నా తాగునీరు కాలుష్యమవుతున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గజపతినగరం నియోజకవర్గంలోని గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ మండలాలకు సంబంధించి 77 సచివాలయాలకు ఒక్కోటి చొప్పున ఫీల్డు టెస్ట్‌ కిట్‌(ఎఫ్‌టీకే)లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కోదాని విలువ సుమారు రూ.5వేలు. ఇంజనీరింగ్‌ సహాయకులు ప్రతీ 15 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో తాగునీటిని పరీక్షించి సురక్షితమని నిర్ధారించాకే సరఫరా చేయాలి. మంచినీటి పథకంలో నీరు బాగున్నా పైపులైన్ల లీకులతో కలుషిత జలాలు వెళ్లే అవకాశం ఉంది. అందుకే తాగునీటి చేతిపంపు, ప్రధాన ట్యాంకర్‌, వీధి కొళాయిల దగ్గర(మూడు చోట్ల) నమూనాలు సేకరించి పరీక్షించాలి. ఎక్కడా ఇలా చేయడం లేదు. కానీ నియోజకవర్గంలో ఎక్కడా లోపంలేదని రిపోర్టులు వస్తున్నాయి.

ఇలా ఉంటే సురక్షితం

- నీటి పీహెచ్‌ విలువ 6.4నుంచి 8.5ఉండాలి.

- రంగు, రుచి, వాసన, మడ్డితనం 5నుంచి 10 యూనిట్లు వరకు ఉండాలి.

- లీటరు నీటిలో కాఠిన్యత 200-600మిల్లీ గ్రాములు, ఫ్లోరైడ్‌ 10, ఇనుము 0.3, సల్ఫేట్‌ 200మిల్లీగ్రాములు చొప్పున ఉంటే సురక్షితమని వైద్యులు చెబుతున్నారు.

ఇవీ అనర్థాలు

- నీటిలో క్లోరిన్‌ శాతం అధికంగా ఉంటే చర్మవ్యాఽధులు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది.

- పరిమితికి మించి ఫ్లోరైడ్‌ ఉంటే ప్లోరోసిస్‌ సోకుతుంది.

- ప్లోరోసిస్‌ సోకితే ఎముకలు, దంతాలు దెబ్బతింటాయి

- ఇనుము శాతం ఎక్కువగా ఉన్నా ఇబ్బందులు ఉంటాయి.

నిర్లక్ష్యం తగదు

సచివాలయ పరిధిలో తాగునీటి వనరులను క్రమం తప్పకుండా పరీక్షించాలి. ప్రభుత్వం ఇంజనీరింగ్‌ సహాయకులకు ఆ బాధ్యతలు అప్పగించింది. ప్రతీ 15 రోజులకు టెస్టులు నిర్వహించి వచ్చిన ఫలితాలు తెలియజేయాలి. ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకుంటాం. పరీక్షల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించం

- డి.శంకరావు, డిప్యూటీ ఎంపీడీవో

Updated Date - Apr 10 , 2026 | 12:20 AM