Share News

Water for the Outskirts, శివారుకు నీరందితే సస్యశ్యామలమే!

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:07 AM

Water for the Outskirts, Greenery All Around! ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టుకూ పూర్తి స్థాయిలో సాగునీరందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మేరకు భారీగా నిధులు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగానే.. జిల్లాలో కీలక జలాశయం పెద్దగెడ్డ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. కాలువల ఆధునికీకరణతో పాటు సాలూరు, బొబ్బిలి మండలాలకు పైపులైన్ల ద్వారా సాగు, తాగునీటిని అందించే దిశగా చర్యలు చేపట్టింది.

Water for the Outskirts, శివారుకు నీరందితే  సస్యశ్యామలమే!
పెద్దగెడ్డ జలాశయం స్పిల్‌వే

  • రూ.73.8 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

పాచిపెంట రూరల్‌, జూలై29(ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టుకూ పూర్తి స్థాయిలో సాగునీరందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మేరకు భారీగా నిధులు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగానే.. జిల్లాలో కీలక జలాశయం పెద్దగెడ్డ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. కాలువల ఆధునికీకరణతో పాటు సాలూరు, బొబ్బిలి మండలాలకు పైపులైన్ల ద్వారా సాగు, తాగునీటిని అందించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ.73.8 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాగా మంజూరైన నిధుల్లో రూ.56 కోట్లతో కాలువల ఆధునికీకరణ, పైపులైన్‌, పిల్ల కాలువల అభివృద్ధి పనులు చేపట్టను న్నారు. మిగతా నిధులతో విద్యుత్‌ లైన్లు ఏర్పాటు, రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. డీడీఆర్‌ వంటి సాంకేతిక పనులు కూడా చేపట్టనున్నారు. జలాశయం ద్వారా ఖరీఫ్‌, రబీలో రెండు పంటలకు పైపులైన్ల ద్వారా సాగునీరు అందించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నీటి వృథాను అరికట్టేందుకు వీలుగా బిందు, సూక్ష్మ సేద్య పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు గ్రామీణ, పట్టణ వాసులకు పైపులైన్ల ద్వారా తాగునీటిని అందించనున్నారు.

ఇదీ పరిస్థితి..

- పాచిపెంటలో ఉన్న పెద్దగెడ్డ జలాశయం పరిధిలో సుమారు 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాలకు చెందిన రైతులకు ఈ ప్రాజెక్టే ఆధారం. ప్రస్తుతం జలాశయం ప్రధాన కాలువల ద్వారా 8వేల ఎకరాలకు , కర్రివలస ఆనకట్ట పరిధిలో నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

- ప్రాజెక్టు పరిధిలో 18 కిలోమీటర్ల మేరకు ప్రధాన కాలువలు, 360 కిలోమీటర్లు మేర పిల్ల కాలువలు ఉన్నాయి. అయితే సరైన నిర్వహణ లేక కాలువలు అధ్వానంగా మారాయి. దీంతో ఏటా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. కాలువల ఆధునికీరణకు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రూ.18 కోట్లు వరకు జైకా నిధులు మంజూరయ్యాయి. అయితే పది శాతం పనులు మాత్రమే జరిగాయి. సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాలతో మిగతా పనులకు బ్రేక్‌ పడింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పరిస్థితి, రైతుల సమస్యలపై దృష్టి సారించింది. ఈ మేరకు కాలువల ఆధునికీకరణ , ఇతరత్రా పనులకు భారీగా నిధులు మంజూరు చేసింది. దీంతో మూడు మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరి తగతిన ఈ పనులు పూర్తయితే శివారు ఆయకట్టుదారుల సాగునీటి కష్టాలు తీరుతాయి. అంతే కాదు ఈ ప్రాంతం ఏటా రెండు పంటలతో సస్యశ్యామలమవుతుందని రైతులు భావిస్తున్నారు.

త్వరలో పనులు ప్రారంభిస్తాం..

‘పెద్దగెడ్డకు కేటాయించిన నిధులతో అండర్‌ గ్రౌండ్‌ సిస్టమ్‌, పైపులైన్‌ తదితర పనులు చేపడతాం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. సాంకేతిక పరిజ్ఞానంతో త్వరలోనే ఆయా నిర్మాణాలు ప్రారంభిస్తాం. ’ అని అసిస్టెంట్‌ చీఫ్‌ ఇంజనీరింగ్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Jul 30 , 2026 | 12:07 AM