Remove the shop? బడ్డీని తొలగించమన్నందుకేనా?
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:43 PM
Was It Just for Asking to Remove the shop? మక్కువలో టీడీపీ సీనియర్ నేతపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన ఎడమ చేతికి గాయాలయ్యాయి. మంగళవారం మండల కేంద్రంలోని నాలుగురోడ్ల కూడలి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
పనుల పరిశీలనకు వచ్చిన టీడీపీ నేతపై కత్తితో దాడి
ఎడమ చేతికి గాయాలు
నిందితుడిని నిలువరించిన స్థానికులు ..
అదుపులోకి తీసుకున్న పోలీసులు
మక్కువ రూరల్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): మక్కువలో టీడీపీ సీనియర్ నేతపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన ఎడమ చేతికి గాయాలయ్యాయి. మంగళవారం మండల కేంద్రంలోని నాలుగురోడ్ల కూడలి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మక్కువకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, క్లస్టర్ ఇన్‌చార్జి డాక్టర్ పట్నాన మల్లేశ్వరరావు గ్రామంలో ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించేందుకు నాలుగురోడ్ల కూడలి వద్దకు వచ్చారు. అదే ప్రాంతంలో గొర్లె నారాయణరావుకు బడ్డీ ఉంది. పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఆ బడ్డీని తొలగించాలని వారం రోజుల కిందట అధికారులు నోటీసులిచ్చారు. ఈ క్రమంలో రోడ్డు పనుల పరిశీలనకు వచ్చిన మల్లేశ్వరరావుపై బడ్డీ యజమాని నారాయణరావు బొండాలు నరికే కత్తితో వెనుక నుంచి దాడి చేశాడు. దీంతో వెంటనే తేరుకున్న మల్లేశ్వరరావు పక్కకు తప్పుకోగా.. స్థానికులు వెంటనే అప్రమత్తమై నారాయణరావును నిలువరించారు. ఈ ఘటనలో టీడీపీ నాయకుని ఎడమ చేతికి గాయాలవగా.. మద్యం మత్తులోనే నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని బడ్డీ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు మల్లేశ్వరావువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎం.వెంకటరమణ తెలిపారు. కాగా ఈ ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆరా తీశారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు లను ఆదేశించారు. మరోవైపు టీడీపీ మండల పెద్దఎత్తున మక్కువ చేరుకుని పి.మల్లేశ్వరరావును పరామర్శించారు.