Share News

పురపాలక సంఘాల్లో పెరగనున్న వార్డులు

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:42 PM

జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్య పెరగనుంది.

పురపాలక సంఘాల్లో పెరగనున్న వార్డులు
పార్వతీపురం పురపాలక సంఘం

- జనాభా ప్రాతిపదికన పెంపు

-పార్వతీపురంలో 30 నుంచి 40కు..

- పాలకొండలో 20 నుంచి 29కు..

- సాలూరులో కూడా పెరిగే అవకాశం

పార్వతీపురం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్య పెరగనుంది. జనాభా ప్రాతిపదికన వార్డులను పెంచాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వును జారీ చేసింది. రాబోయే ఎన్నికల నాటికి జిల్లాలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్యలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీ ఉన్నాయి. ప్రస్తుతం పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. జనాభా 62 వేలకు పైబడి ఉన్నారు. ఈ ప్రాతిపదికన వార్డుల సంఖ్య 40కు పెరిగే అవకాశం ఉంది. మరోపక్క పార్వతీపురం పట్టణానికి ఆనుకొని ఉన్న నర్సిపురం, లక్ష్మీనారాయణపురం, బాలగొడబ, శివుని, వెంకంపేట తదితర గ్రామాలను పురపాలక సంఘంలోకి విలీనం చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు ప్రారంభించారు. తద్వారా పార్వతీపురం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే 40 వార్డుల కంటే ఎక్కువ వార్డులు ఏర్పడే అవకాశం ఉంది. సాలూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం 29 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 59 వేల జనాభా ఉన్నారు. దీని ప్రకారం ఈ పురపాలక సంఘంలో మరికొన్ని వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పాలకొండ నగర పంచాయతీలో ప్రస్తుతం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 40 వేల జనాభా నివసిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్య 29కి పెరిగే అవకాశం ఉంది. పార్వతీపురం, సాలూరు, పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో కౌన్సిలర్లగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో ఆనందం నెలకొంది.

Updated Date - Mar 25 , 2026 | 11:42 PM