War of Words on Issues సమస్యలపై అక్షర యుద్ధం
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:09 PM
War of Words on Issues ప్రజల సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ అక్షర యుద్ధం చేస్తోంది. పట్టణాల్లోని ప్రధాన వార్డుల్లో సమస్యలను గుర్తించి.. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా సాలూరు 17వ వార్డులో సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు శనివారం పట్టణంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కా రమే అజెండాగా’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ప్రజల నుంచి విశేష స్పందన
తమ ఇక్కట్లపై 17వ వార్డు వాసుల ఆవేదన
పరిష్కారానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ
‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’కు కృతజ్ఞతలు
పార్వతీపురం/సాలూరు, మార్చి14(ఆంధ్రజ్యోతి):
ప్రజల సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ అక్షర యుద్ధం చేస్తోంది. పట్టణాల్లోని ప్రధాన వార్డుల్లో సమస్యలను గుర్తించి.. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా సాలూరు 17వ వార్డులో సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు శనివారం పట్టణంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కా రమే అజెండాగా’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వార్డు వాసులు పెద్దఎత్తున హాజరై.. తమ సమస్యలను తెలియజేశారు. కాగా పట్టణంలో 17వ వార్డుతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. సమస్యలను గుర్తించడంతో పాటు పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
సాలూరులో వెలమపేటలో సీతారామ కల్యాణమండపంలో నిర్వహించిన ‘అక్షరం అండగా ... పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా 17 వార్డు ప్రజలు ఎన్నో సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని.. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. విద్యుత్ స్తంభాలతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. పురపాలక సంఘం ద్వారా 17వ వార్డులో ఇతర సమస్యలను పరిష్కరించాలని సబ్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్‌కు సూచించారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ద్వారా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సాలూరు పట్టణ అభివృద్ధికి గతంలో నిధులు మంజూరు చేసినప్పటికీ మునిసిపల్ పాలకవర్గం తీర్మానాలు లేక పనులు ముందుకు సాగలేదని తెలిపారు. అయినప్పటికీ ప్రజా సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటు న్నామన్నారు. అనంతరం పలు సమస్యలపై వార్డువాసుల నుంచి ఆమె వినతిపత్రాలు స్వీకరించారు.
ఆ తర్వాత సబ్ కలెక్టర్ డాక్టర్ వైశాలి మాట్లాడుతూ.. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరి స్తామని తెలిపారు. పురపాలక సంఘ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వాటిపై దృష్టి సారిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సాలూరు మునిసిపల్ కమిషనర్ రత్నకుమార్, తహసీల్దార్ సురేష్, ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం బ్రాంచి మేనేజర్ సోమశంకరరావు, ఎడిషన్ ఇన్‌చార్జి పి.బయపరెడ్డి, యాడ్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, డీసీఎం అనంతకుమార్, ఏబీఎన్ స్టాఫర్ బూరాడ శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫర్ డీఎస్‌ఆర్ పట్నాయక్, టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, ఆముదాల పరమేష్, కౌన్సిలర్ హర్షవర్ధన్, 17వ వార్డుతో పాటు వివిధ వార్డుల ప్రజలు , అధికారులు పాల్గొన్నారు.
సమస్యలను విన్నవించిన వార్డువాసులు
సాలూరు వెలమపేట సీతారామ కల్యాణమండపంలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ‘అక్షరం అండగా ... పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 17వ వార్డు ప్రజలు అనేక సమస్యలను ప్రజాప్రతినిఽధులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా తమ వార్డులో లో ఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు. శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని, గూడేపు వీధిలో సీసీ రహదారులు నిర్మించాలని, తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేయాలని, వెలమపేట రామాలయం వద్ద శిథిలమైన విద్యుత్ స్తంభం తొలగించి కొత్త దానిని ఏర్పాటు చేయాలని విన్నవించారు. శ్యామలాంబ గుడి వద్ద ప్రత్యేక మండపం ఏర్పాటు చేయాలని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేశారు. మంత్రితో సహా అధికారులు ప్రజలు చెప్పిన వాటిని శ్రద్ధగా విన్నారు. కొన్ని సమస్యలకు సంబంధించి సభావేదిక వద్దే సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
‘ఆంధ్రజ్యోతి’ చొరవ అభినందనీయం
‘ మా సమస్యలను చెప్పుకోవడానికి ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు వెళ్లాలంటే ఎంతో సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ప్రధానంగా అధికారులను కలవాలంటే వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ అండగా నిలిచి మా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం అభినందనీయం. మేము ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ కి అండగా ఉంటాం.’ అని వార్డు వాసులు తెలిపారు.