Walking Four Kilometres.. నాలుగు కిలోమీటర్లు నడిచి.. రాళ్లు, రప్పలు దాటి!
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:47 PM
Walking Four Kilometres.. Crossing Rocks and Rough Terrain! తమ గ్రామానికి రోడ్డు మంజూరైందని ఆ గిరి శిఖర వాసులు ఎంతో ఆనందించారు. ఇక తమకు డోలీ మోతలు తప్పుతాయని భావించారు. అయితే రోడ్డు మంజూరైనా.. ఎర్క్ వర్క్ చేసి ఆపేయడంతో వారి ఆనందం ఆవిరైంది. ప్రస్తుతం గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా ఆ గ్రామస్థులకు డోలీ కష్టాలు తప్పడం లేదు.
గ్రామానికి రోడ్డు మంజూరైనా పనులు పూర్తికాని వైనం
గిరిజనులకు తప్పని ఇబ్బందులు
కొమరాడ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): తమ గ్రామానికి రోడ్డు మంజూరైందని ఆ గిరి శిఖర వాసులు ఎంతో ఆనందించారు. ఇక తమకు డోలీ మోతలు తప్పుతాయని భావించారు. అయితే రోడ్డు మంజూరైనా.. ఎర్క్ వర్క్ చేసి ఆపేయడంతో వారి ఆనందం ఆవిరైంది. ప్రస్తుతం గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా ఆ గ్రామస్థులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. వివరాల్లోక వెళ్తే..
కొమరాడ మండలం పాలెం పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం కుస్తూర్‌కు చెందిన తాడంగి సురేష్ (35) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శ్వాస సరిగ్గా ఆడకపోవడం, కడుపు ఉబ్బరం తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఇటీవల ఆయన్ని కుటుంబ సభ్యులు పార్వతీపురం, విజయనగరం జిల్లాకేంద్రాసుపత్రులకు తీసుకెళ్లారు. వైద్యులు కొంతమేర చికిత్స అందించడంతో పరిస్థితి మెరుగైంది. దీంతో కొద్దిరోజుల కిందట సురేష్ ఇంటికి తిరిగొచ్చాడు. అయితే శుక్రవారం మళ్లీ ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు , గ్రామస్థులు కలిసి డోలీ కట్టారు. సుమారు నాలుగు కిలోమీటర్లు సురేష్‌ను మోసుకుంటూ.. రాళ్లు , రప్పలు దాటుకుని కొండ దిగారు. అక్కడ నుంచి ఆటో ద్వారా రాయిపురం చేరుకున్నారు. ఆ ప్రాంతంలో మరో వాహనం అద్దెకు తీసుకుని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం సురేష్ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తమ గ్రామ రహదారి పనులు సగంలో వదిలేయడంతో ఈ దుస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోయారు. ప్రస్తుతం తమ మండలంలోని రెబ్బ, వనధార, చీశాడవల్ల , నయా, రామభద్రపురం - అల్లువాడ, కొండ కూనేరు -బెడ్డ, లంజి- కుంతేసు, దిగువ గుణదల - తీలేసు, వానబడి గిరిశిఖర గ్రామాల్లో బీటీ రోడ్డు పనులు సగంలో నిలిచిపోయాయన్నారు. దీంతో గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా డోలీ మోతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతి నిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.