Share News

Climb Up and Down the Hill రెండు కిలోమీటర్లు నడిచి.. కొండ దిగి ఎక్కాల్సిందే..

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:30 PM

Walk 2 Kilometres… Climb Up and Down the Hill గిరిశిఖర గ్రామం శిఖరపాయికు చెందిన గిరిజనులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. బిందెడు ఊట నీటి కోసం ఆ గ్రామ గిరిజన మహిళలు రెండు కిలోమీటర్లు నడిచి.. కొండ దిగి ఎక్కాల్సి వస్తోంది. కొన్నాళ్లుగా ఆ ప్రాంతవాసులు ఈ సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

  Climb Up and Down the Hill రెండు కిలోమీటర్లు నడిచి.. కొండ దిగి ఎక్కాల్సిందే..
ఊట నీటిని సేకరిస్తున్న గిరిజనులు

  • ఇదీ గిరిశిఖర గ్రామం శిఖరపాయిలో పరిస్థితి..

  • ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌13(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామం శిఖరపాయికు చెందిన గిరిజనులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. బిందెడు ఊట నీటి కోసం ఆ గ్రామ గిరిజన మహిళలు రెండు కిలోమీటర్లు నడిచి.. కొండ దిగి ఎక్కాల్సి వస్తోంది. కొన్నాళ్లుగా ఆ ప్రాంతవాసులు ఈ సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మండల కేంద్రానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరపాయి గ్రామంలో సుమారు వంద మంది నివసిస్తున్నారు. వారి అవసరాల కోసం గతంలో ఐటీడీఏ అధికారులు శిఖరపాయిలో ఓ ట్యాంక్‌ను నిర్మించారు. గ్రావిటీ పైప్‌లైన్‌ ద్వారా కొండ ప్రాంతం నుంచి నీటిని అందించేవారు. అయితే గ్రావిటీ పైప్‌లైన్‌ దెబ్బతినడంతో నీరు రావడం లేదు. దీంతో ఆ గ్రామస్థులు ఊట నీటిపై ఆధారపడాల్సి వస్తోంది. దీని కోసం వారు నిత్యం కొండ దిగి ఎక్కాల్సి వస్తోంది. వాస్తవంగా శిఖరపాయికి సరైన రహదారి లేదు. ఈ కారణంగా రిగ్గు వాహనం గ్రామానికి చేరుకోలేకపోవడంతో అక్కడ బోర్‌ ఏర్పాటు చేయలేకపోయారు. గతంలో గ్రామస్థులు బావి తవ్వినా నీరు పడలేదు. ఈ కారణంగానే వారు కొండల నుంచి వచ్చే ఊట నీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ నీరు కలుషితమైనా తప్పనిసరి పరిస్థితుల్లో దానినే వినియోగిస్తూ రోగాల పాలవుతున్నారు. ఐటీడీఏ అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించాలని, తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. ‘మా పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాలకు సరైన తాగునీటి సౌకర్యం లేదు. తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలి.’ అని తాడికొండ మాజీ సర్పంచ్‌ జగ్గారావు కోరారు. త్వరలో గ్రావిటీ పైప్‌లైన్‌ బాగు చేసి నీటి సరఫరా చేస్తామని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ అధికారులను ఆ గ్రామానికి పంపిస్తాం. గ్రావిటీ పైప్‌లైన్‌ మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తాం. ఆ గ్రామస్థులకు తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 11:30 PM