Waiting for seven yearsఏడేళ్లుగా ఎదురుచూపులు
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:01 AM
Waiting for seven years ఎన్టీఆర్ ఇంటి బిల్లుల కోసం ఏడేళ్లుగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. వైసీపీ హయాంలో వీరిని పూర్తిగా విస్మరించారు. విన్నపాలు ఇచ్చినా బుట్టదాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం రావడంతో వారంతా ఆశతో ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో 5,186 మంది లబ్ధిదారులకు రూ.18.87 కోట్లు చెల్లించాల్సి ఉందని జిల్లా అధికారులు నివేదికలు పంపారు. ఇది జరిగి ఏడాది అవుతున్నా వాటికి మోక్షం లేదు.
ఏడేళ్లుగా ఎదురుచూపులు
ఇంటి బిల్లు ఎప్పుడు?
గత టీడీపీ హయాంలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం
పెండింగ్ బిల్లులు రూ.18.87 కోట్లు
రాజాం నియోజకవర్గంలో అత్యధికంగా రూ.7.50 కోట్లు
కూటమి కరుణ కోసం లబ్ధిదారుల ఎదురుచూపు
ఎన్టీఆర్ ఇంటి బిల్లుల కోసం ఏడేళ్లుగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. వైసీపీ హయాంలో వీరిని పూర్తిగా విస్మరించారు. విన్నపాలు ఇచ్చినా బుట్టదాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం రావడంతో వారంతా ఆశతో ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో 5,186 మంది లబ్ధిదారులకు రూ.18.87 కోట్లు చెల్లించాల్సి ఉందని జిల్లా అధికారులు నివేదికలు పంపారు. ఇది జరిగి ఏడాది అవుతున్నా వాటికి మోక్షం లేదు.
రాజాం, సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి):
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల కోసం ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సబ్‌ప్లాన్ నిధుల నుంచి రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకూ అదనంగా మంజూరు చేసింది. 2014 నుంచి 2017 వరకూ మంజూరైన ఇళ్లకు బిల్లుల చెల్లింపులు సక్రమంగానే జరిగాయి. అటు తరువాత ఇంటి బిల్లుల చెల్లింపులో కాస్త జాప్యం జరిగింది. ఇంతలో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రావడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులను ఆపేసింది. అప్పటి నుంచి లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక నాయకులు చాలాచోట్ల కలెక్షన్ల పర్వానికి దిగారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయిస్తామని చాలా గ్రామాల్లో భారీగా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే జగన్ సర్కారు నుంచి ఉలుకూపలుకూ లేకపోవడంతో లబ్ధిదారులు నిలువునా మోసపోయారు. అటు బిల్లులు రాక.. ఇటు నేతలకు కొంత వరకూ సమర్పించుకొని రెండింటికీ చెడ్డ రేవడిగా మిగిలారు. జిల్లాలో ఎక్కువగా రాజాం నియోజకవర్గంలో ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో చెల్లింపులు ఉండిపోయాయి. అత్యల్పంగా విజయనగరం నియోజకవర్గంలో 68 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది.
ఎదురుచూస్తున్నాం
ఇంటి నిర్మాణ బిల్లుల కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాం. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది కానీ బిల్లులు సగమే చెల్లించారు. వైసీపీ ప్రభుత్వం దాని గురించి అసలు పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా మా బిల్లులకు మోక్షం కలగకపోవడం బాధగా ఉంది.
గురవాన రాములమ్మ, ఎన్టీఆర్ గృహనిర్మాణ లబ్ధిదారు, రాజాం
అప్పు చేసి ఇల్లు కట్టాం
పేరుకే గృహనిర్మాణ లబ్ధిదారులం. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. బిల్లులు మాత్రం చెల్లించలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వినతిపత్రాలు అందించినా కనీసం పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులు వివరాలు తీసుకోవడంతో బిల్లులు మంజూరుచేస్తారని ఆశించాం. కానీ ఇంతవరకూ చెల్లించలేదు.
పెంకి మోహిణి, ఎన్టీఆర్ గృహనిర్మాణ లబ్ధిదారు, రాజాం
ప్రభుత్వానికి నివేదించాం
ఏడాదిన్నర కిందట జిల్లాలో సర్వే చేశాం. ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపాం. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో 5,186 ఇళ్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం వద్ద కూడా సమగ్ర సమాచారం ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమవుతుంది.
- శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ, విజయనగరం
ఎన్టీఆర్ ఇళ్లకు చెల్లించాల్సిన బిల్లుల వివరాలు
=========================
నియోజకవర్గం చెల్లించాల్సిన బిల్లులు
=========================
1.రాజాం రూ.7.50 కోట్లు
2.బొబ్బిలి రూ.2.291కోట్లు
3.నెల్లిమర్ల రూ.2.52కోట్లు
4.చీపురుపల్లి రూ.1.52కోట్లు
5.విజయనగరం రూ.68 లక్షలు
6.ఎస్.కోట రూ.2.21 కోట్లు
7.గజపతినగరం రూ.1.81కోట్లు
========================