Share News

New Pensions కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపు

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:22 AM

Waiting for New Pensions కొత్త పింఛన్ల కోసం ఈనెల 14 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురించాయి. ఈ మేరకు వితంతువులు, వృద్ధులు సచివాలయాలకు వెళ్తున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు చెప్పడంతో నిరాశతో వారు వెనుదిరుగుతున్నారు.

  New Pensions కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపు
కొత్త పింఛన్లు కోసం ఎదురు చూస్తున్న పీటీ మండ గిరిజనులు

  • అయితే ఇంకా కార్యరూపం దాల్చని దరఖాస్తుల స్వీకరణ

  • ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

జియ్యమ్మవలస, జూన్‌20(ఆంధ్రజ్యోతి): కొత్త పింఛన్ల కోసం ఈనెల 14 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురించాయి. ఈ మేరకు వితంతువులు, వృద్ధులు సచివాలయాలకు వెళ్తున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు చెప్పడంతో నిరాశతో వారు వెనుదిరుగుతున్నారు. మొత్తంగా కొత్త పింఛన్ల కోసం జిల్లాలో ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 1,37,669 వరకు వివిధ రకాల పింఛన్‌దారులు ఉన్నారు. వారి కోసం ప్రతినెలా ప్రభుత్వం రూ. 59.23 కోట్లు మంజూరు చేస్తుంది. ఈ మేరకు సచివాలయ సిబ్బంది ప్రతి నెలా ఒకటో తేదీన నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే కొత్త పింఛన్ల విషయంలో సచివాలయ సిబ్బంది ఈ ఏడాది జనవరి నుంచి యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్‌ఎస్‌) చేశారు. ఇప్పుడు మ్యాపింగ్‌ కోసం రీవెరిఫికేషన్‌ చేస్తున్నారు.

వాస్తవంగా 2024 ఫిబ్రవరి నుంచే ఆగిన కొత్త పింఛన్లు మంజూరు పక్రియ ఆగింది. ప్రస్తుతం పింఛను పొందుతున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు స్పౌజ్‌ కోటా కింద పింఛను ఇచ్చేస్తున్నారు. కానీ వితంతువులు, ఇతర వృద్ధులకు మాత్రం పింఛన్లు మంజూరు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జియ్యమ్మవలస మండలంలో గిరిజన పంచాయతీలైన టీకే జమ్ము, పీటీ మండ, కొండచిలకాం, అర్నాడ, అలమండలో దాదాపు వంద మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. చినమేరంగి పంచాయతీలో 30మంది, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమ రాడ, సీతంపేట, భామిని, పాచిపెంట, సాలూరు, మక్కువ మండలాలు 40 శాతం గిరిజనులతో పాటు జిల్లాలో ఎంతోమంది బాధితులు కొత్త పింఛన్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై డిప్యూటీ ఎంపీడీవో హరిప్రసాద్‌ను వివరణ కోరగా..‘కొత్త పింఛన్ల మంజూరు విషయంలో ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. ’ అని తెలిపారు.

Updated Date - Jun 21 , 2026 | 12:22 AM