Share News

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపు

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:43 PM

కొత్త పింఛన్ల కోసం అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా వాటిని ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపు

- మూడేళ్లుగా మంజూరు కాని వైనం

- జిల్లాలో 6,050 మంది వరకు నిరీక్షణ

విజయనగరం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కొత్త పింఛన్ల కోసం అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా వాటిని ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 6,050 మంది పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఆ తరువాత ఆ ఊసే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా అదే పరిస్థితి. కొత్తవి కాకుండా స్పౌజ్‌ కోటా కింద పింఛన్లు మంజూరు చేస్తోంది. పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతే ఆ పింఛన్‌ను భార్యకు బదిలీ చేస్తున్నారు. అంతేతప్ప, వితంతువులు, 60 ఏళ్లు నిండిన వారికి, దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. వృద్ధాప్య పింఛన్‌ వస్తే ఆ డబ్బులతో కనీసం మందులైనా కొనుకుందాం అనే వృద్ధులు జిల్లాలో అనేక మంది ఉన్నారు. విభిన్న ప్రతిభావంతులు సైతం తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు, ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు నిర్వహించే ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి కొత్త పింఛన్ల కోసం అధిక సంఖ్యలో అర్జీలు వస్తున్నాయి. ఇప్పటికైనా మంజూరు చేయాలని అర్జీదారులు కోరుతున్నారు.

ఇబ్బంది పడుతున్నా..

నాకు 75 ఏళ్లు నిండాయి. కాటికి కాళ్లు చాపుకుంటూ కూర్చున్నా. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా. మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా. గత పదేళ్ల నుంచి పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పటికైనా అధికారులు నామీద దయతలచాలి.

-తమ్మినేని అప్పలస్వామి, గజపతినగరం మండలం, గంగచోళ్లపెంట

Updated Date - Apr 17 , 2026 | 11:43 PM