Waiting నిరీక్షణ
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:19 AM
Waiting ఏపీఈఏపీ సెట్ ఫలితాలు ఈనెల ఒకటిన విడుదలైనా ఇప్పటికీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలపై స్పష్టత రాలేదు. అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
నిరీక్షణ
ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు
ఏపీఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైనా ప్రారంభం కాని ఆడ్మిషన్లు
అయోమయంలో 20 వేల మంది విద్యార్థులు
విజయనగరం కలెక్టరేట్, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఏపీఈఏపీ సెట్ ఫలితాలు ఈనెల ఒకటిన విడుదలైనా ఇప్పటికీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలపై స్పష్టత రాలేదు. అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంజనీరింగ్ డిగ్రీ, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు ఈ నెల ఒకటిన విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలైతే ఏప్రిల్ 26న విడుదలయ్యాయి. డిగ్రీలో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. సాధారణంగా డిగ్రీలో చేరడానికి ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులంతా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఆన్‌లైన్ నమోదుకు ఆదేశాలు ఇవ్వలేదు. ఇంజనీరింగ్‌లో దాదాపు 15 వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందాల్సి ఉంది. జిల్లాలో 8 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ముందుగా ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. తరువాత కాలేజీల వారిగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. అనంతరం ఎంపికైన కాలేజీ నుంచి ఎలాట్‌మెంట్ ఆర్డర్, జాయింగ్ ఆర్డర్లు వస్తాయి. ఆపై విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో చేరతారు. ఈ ప్రక్రియ మొదలు కాకపోవడంతో ఏం చేయాలో తోచక నిరీక్షిస్తున్నారు.
-----------------