ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలకం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:42 AM
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలకమైందని ఆర్డీవో దాట్ల కీర్తి అన్నారు.
- ఆర్డీవో కీర్తి
- ఘనంగా ఓటర్ల దినోత్సవం
విజయనగరం కలెక్టరేట్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలకమైందని ఆర్డీవో దాట్ల కీర్తి అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక మహిళా పోలీసు స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశాన్ని చదివి వినిపించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో కీర్తి మాట్లాడుతూ.. 2010 నుంచి దేశ వ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. రాజ్యాంగం అమలులోకి రావడానికి ఒక రోజు ముందే ఎన్నికల కమిషన్ ఏర్పడిందని, అప్పటి నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. మతం, కులం, జాతి, భాష అనే బేధాలు లేకుండా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రసుత్తం ఎన్నికల్లో 70 శాతం మంది మాత్రమే పాల్గొంటున్నారని, మిగిలిన వారిని కూడా చైతన్యపరిచి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగే ఎన్నికల్లో భాగస్వాములను చేయాలని కోరారు. ప్రత్యేక ఉపకలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు ద్వారానే సుస్థిర ప్రభుత్వం సాధ్యమవుతుందన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడంలో ఓటర్ల దినోత్సవం ఎంతో ఉపయోపడుతుందని పేర్కొన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. అత్యధిక సార్లు ఓటు వేసిన వృద్ధులను, ఓటింగ్‌లో పాల్గొన్న ట్రాన్స్ జెండర్లను అధికారుల బృందం ఘనంగా సన్మానించాంది. అనంతరం నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ అప్పలరాజు, డీఈవో మాణిక్యం నాయుడు, తహసీల్దార్లు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.