ఓటు భద్రం ‘సర్’
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:19 PM
పారదర్శకమైన, కచ్చితత్వం కలిగిన, తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది.
- మ్యాపింగ్ చేసుకోకపోతే సమస్యలు తప్పవు
- జిల్లాలో మొదలైన ‘సర్’ ప్రక్రియ
- జూలై 14 వరకూ కొనసాగింపు
రాజాం రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): పారదర్శకమైన, కచ్చితత్వం కలిగిన, తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందుకు ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) మ్యాపింగ్ ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. సర్‌లో ప్రధానమైన మూడురకాల మ్యాపింగ్‌లు ఉన్నాయి. వీటిపై ప్రతిఒక్కరికీ స్పష్టమైన అవగాహన ఉండాలి. మీఓటు భద్రంగా ఉండాలంటే అందరూ మ్యాపింగ్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సర్ ప్రక్రియ జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైంది. జూలై 14 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సమయంలో మ్యాపింగ్ చేయించుకుంటే మీ ఓటు భద్రంగా ఉంటుంది. లేకపోతే సమస్య తలెత్తే అవకాశం లేకపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
2002 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్..
- 2002 తరువాత పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిన మహిళల కోసం ఈ మ్యాపింగ్ ఉద్దేశించబడింది.
- ఎందుకంటే మీరు పెళ్లి చేసుకున్న ఊరిలో 2002 ఓటర్ల జాబితాలో మీపేరు ఉండదు. ప్రస్తుతం ఓటర్ మ్యాపింగ్ అంతా 2002 ఓటర్ల లిస్ట్ ఆధారంగానే జరుగుతోంది.
- ఇలాంటి సమయంలో మీరు పుట్టిన ఊరికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ 2002 ఓటర్ లిస్ట్‌లో మీ అమ్మ లేదా నాన్న పేరు, సీరియల్ నెంబర్ తెలుసుకోండి. ఆ సీరియల్ నెంబర్‌ను ఇప్పుడు భర్తతో నివాసం ఉంటున్న ఊరిలో బీఎల్వోకు ఇవ్వండి. బీఎల్వో ఆ నెంబర్‌తో మీపేరును ప్రస్తుతం నివాసం ఉంటున్న ఊరిలోని ఓటర్ లిస్ట్‌లో మ్యాపింగ్ చేస్తారు. ఇలా చేయకపోతే మీరు మీ ఓటుహక్కును కోల్పోతారు.
మూడు కేటగిరీలు..
- 2002 సర్ ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండి, అదేవిధంగా 2025 ఓటర్ లిస్ట్‌లో కూడా పేరు ఉన్నవారు బీఎల్వో వద్దకు వెళ్లి సెల్ఫ్ మ్యాపింగ్ చేయించుకోవాలి
- 2002 సమయంలో ఓటుహక్కు వయసు రాకపోవడంతో జాబితాలో పేరు లేకపోయినా, ప్రస్తుతం (2025) ఓటర్ లిస్ట్‌లో పేరు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. మీ అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ పేర్లలో ఏదైనా ఒకటి 2002 సర్ జాబితాలో ఉంటే మీరు తప్పనిసరిగా యాడ్ (చేర్పులు) ప్రొజెన్సీ మ్యాపింగ్ చేయించుకోవాలి.
- 2002 నాటికి మీకు 18 ఏళ్లు నిండి ఉన్నా, ఏదైనా కారణంతో సర్ లిస్ట్‌లో మీపేరు లేకపోయినా ఇది వర్తిస్తుంది. మీ అమ్మ, నాన్న, తాత, నాన్నమ్మ, అమ్మమ్మ పేర్లలో ఏదైనా ఒకటి 2002 సర్ లిస్ట్‌లో ఉంటే మీరు బీఎల్వో ద్వారా సెల్ఫ్ ప్రొజెన్సీ మ్యాపింగ్ చేయించుకోవాలి. మీ పరిస్థితిని బట్టి మీరు మూడు కేటగిరీల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి..
ఇది గుర్తుంచుకోవాలి..
మ్యాపింగ్ కోసం బీఎల్వో వద్దకు వెళ్లాక సెల్ఫ్ మ్యాపింగ్, యాడ్ ప్రొజెన్సీ, సెల్ఫ్ ప్రొజెన్సీ అనే పదాలను మీరే వారికి స్పష్టంగా చెప్పండి. మ్యాపింగ్ చేయించుకోండి. ఎందుకంటే మ్యాపింగ్ కోసం నియమితులైన వారిలో ఎక్కువమంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు ఉండే వీలుంది.