సరిచేస్తేనే ఓటు
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:30 AM
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా తయారీ(సర్) తర్వాత బిఎల్‌వోల నుంచి నోటీసులు అందుకున్న ఓటర్లు టెన్షన్ పడుతున్నారు. ఓటు ఉంటుందో ఉండదోనని సందేహ పడుతున్నారు.
-‘సర్’ సర్వే తరువాత జిల్లాలో 1,93,734 మందికి నోటీస్‌లు జారీ
-ఆధార్‌తో పాటు మరో గుర్తింపు కార్డు సమర్పించడం తప్పనిసరి
-బీఎల్‌వో సంతృప్తితో తప్పులు లేకుండా ఓటు నమోదుకు చర్యలు
-అధికారుల విచారణ అనంతరం పూర్తి స్థాయి జాబితా
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా తయారీ(సర్) తర్వాత బిఎల్‌వోల నుంచి నోటీసులు అందుకున్న ఓటర్లు టెన్షన్ పడుతున్నారు. ఓటు ఉంటుందో ఉండదోనని సందేహ పడుతున్నారు. వారంతా ఎన్నికల కమిషన్ సూచించిన ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆపై సహాయ ఎన్నికల అధికారులు విచారించి శాశ్వత ఓటరు జాబితాలో నమోదుకు ప్రతిపాదిస్తారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 20వరకూ కొనసాగనుంది. ఆ తర్వాతే ఓటరు జాబితాపై పూర్తి స్పష్టత వస్తుంది.
శృంగవరపుకోట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఎస్.కోటలో ఉంటున్న ఓ కుటుంబంలో ఐదు ఓట్లు ఉన్నాయి. సర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా తయారీ) తరువాత రూపొందించిన జాబితాలో ఉన్న వీరిపేర్లు 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాలేదు. దీంతో బీఎల్‌ఓ (బూత్ లెవిల్ అధికారి) వీరందరికీ నోటీస్‌లు జారీ చేశారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా పేర్లు నమోదుకు ఆధార్‌తో పాటు మరో గుర్తింపు కార్డు అందించాలని పేర్కొన్నారు. అయితే ఓటు ఉంటుందో పోతుందోనని ఆ కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు.
ఇలా జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ చాలా మంది ఓటర్ల వివరాలు 2002 ఓటరు జాబితాకు అనుగుణంగా మ్యాపింగ్ కాలేదు. జాబితాలో పేర్లు నమోదైనా తప్పులు దొర్లాయి. ఇలాంటి వారందరి ఓట్లు తిరిగి సరి చేసేందుకు బూత్ లెవిల్ అధికారులు నోటీస్‌లు జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,93,734 మంది ఓటర్ల పేర్లు తప్పుగా పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే రాజాంలో 23,787 ఓట్లు, బొబ్బిలి 31,483, చీపురుపల్లి 16,063, గజపతినగరం 20,003, నెల్లిమర్ల 38,499, విజయనగరం 27,303, శృంగవరపుకోట 36,568 మంది ఓటర్ల పేర్లు వివిధ రకాల కారణాలతో ఓటరు జాబితాలో తప్పుగా నమోదయ్యాయి. వీరంతా ఇప్పుడు ఓటు ఉంటుందో ఉండదోనని ఆందోళన చెందుతున్నారు. ‘సర్’ సర్వేకు ముందు జిల్లాలో 15,78,949 ఓటర్లు వుండేవారు. సర్వే అనంతరం 14,51,072 ఓటర్లతో జాబితా తయారైంది. 1,27,877 ఓట్లు తగ్గాయి. రెండు, మూడు ప్రాంతాల్లో ఓట్లు వుండడం, మరణాలు, దూరప్రాంతాలకు శాశ్వతంగా వలస పోవడం, బీఎల్‌ఓలు ఎన్నిసార్లు వెళ్లినా ఓటర్లు దొరక్కపోవడం వంటి కారణాలతో ఈ ఓట్లు అన్నింటినీ జాబితా నుంచి తొలగించారు. అయితే గ్రామాలు, పట్టణాల్లో ఓటర్లు అందుబాటులో వున్నప్పటికీ ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల వివరాలు మ్యాచింగ్ కాలేదు.
ఇవీ కారణాలు
తల్లిదండ్రులు పిల్లల మధ్య వయసు వ్యత్యాసం 15 సంవత్సరాలు తక్కువగా వుండడం, తల్లి దండ్రులు, పిల్లల మధ్య 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడం, ఓటరు తాత, నానమ్మల మధ్య వయసు తేడా 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండడం, ప్రస్తుత ఓటరు జాబితా, 2002 ఓటరు జాబితా మధ్య తండ్రి పేరు తేడా ఉండడం, సంతానం మధ్య వయసు తేడా 9నెలల కంటే తక్కువ ఉండడం, సంతానం ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉండడం, తల్లి తండ్రి పేరు తప్పుగా నమోదు కావడం, ప్రస్తుత ఓటరు జాబితాలో వున్న పేరుకు 2002ఓటరు జాబితాలో వున్న పేరుకు మధ్య పొంతన లేకపోవడం తదితర కారణాలతో చాలా మంది ఓటర్ల విషయంలో ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరాలు వున్నాయి.
ఆధారాలిస్తే ఓటు భద్రం
ఓటరు పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి వివరాలు తప్పులు లేకుండా చూసే బాధ్యతను బూత్ లెవిల్ అధికారి (బీఎల్‌ఓ)కి ఎన్నికల కమిషన్ అప్పగించింది. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హత ధ్రువపత్రం, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం వంటి 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డును ఓటరు బిఎల్‌ఓకు అందించాలి. ఈ గుర్తింపు కార్డుల ఆధారంతో పాటు గ్రామంలో నివశిస్తున్న ఓటరుగా బిఎల్‌ఓలు సంతృప్తి చెందాలి. తిరిగి తప్పులు లేని ఓటరుగా నమోదు చేసేందుకు తయారు చేసిన జాబితాను సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న తహసీల్దార్, ఎంపీడీవోలు విచారిస్తారు. వారు స్వయంగా ఓటరుతో మాట్లాడనున్నారు. ఇందుకు సెప్టెంబర్ 20 వరకు ప్రత్యేక క్యాంపులను గ్రామాల వారీగా ఏర్పాటు చేయనున్నారు. అర్హత వున్న ప్రతి ఒక్కరి ఓటును జాబితాలో తిరిగి నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఓటర్లు ఆధారాలు అందించడం ద్వారా సహకరించాలని కోరుతున్నారు. అయితే గ్రామాల్లో ఓటర్ల నుంచి బిఎల్‌ఓలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే గ్రామంలో ఓటేస్తున్నా కూడా తమ ఓట్లు మ్యాచింగ్ కావడం లేదని చెబుతున్నారెందుకు అని నిలదీస్తున్నారు. వీరికి సర్దిచెప్పలేక బీఎల్‌ఓలు తలలు పట్టుకుంటున్నారు.