Vote ప్రజాస్వామ్యానికి ఓటే అత్యంత కీలకం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:30 AM
Vote Is the Cornerstone of Democracy ప్రజాస్వామ్యానికి ఓటే అత్యంత కీలకమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్‌సీఎం ప్రభుత్వ కార్యాలయ సముదాయాల నుంచి కలెక్టరేట్ వరకు ఓటు హక్కు ప్రాధాన్యతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
పార్వతీపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యానికి ఓటే అత్యంత కీలకమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్‌సీఎం ప్రభుత్వ కార్యాలయ సముదాయాల నుంచి కలెక్టరేట్ వరకు ఓటు హక్కు ప్రాధాన్యతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. ఓటు హక్కు ఆవశ్యకతను తెలుసుకోవాలని సూచించారు. ఓటును అమ్ముకోకుండా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. నేటి తరం యువత దేశాన్ని నడిపించే నాయకులుగా మారాలని పిలుపునిచ్చారు. ఏటా 80 లక్షల మంది డిగ్రీ పూర్తి చేసినా ఐఏఎస్, వంటి ఉన్నత ఉద్యోగాలకు కేవలం ఐదు లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. మిగిలిన వారంతా కనీసం ప్రయత్నం చేయకుండానే ఓటమిని ఒప్పేసుకోవడం తగదన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు నాటిక ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు. ఆ తర్వాత సీనియర్ సిటిజన్ ఓటర్లను సన్మానించారు. కొత్త ఓటర్ల నమోదులో సమర్థంగా పనిచేసిన బీఎల్‌వోలకు ప్రశంసా పత్రాలు అందించారు. క్విజ్ తదితర పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో హేమలత, తహసీల్దార్ సురేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.