Vote is a weapon ఓటే ఆయుధం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:05 AM
Vote is a weapon ఓటు మారింది. బ్యాలెట్ పేపర్ దశ నుంచి ఈవీఎం (ఎలక్ర్టానిక్ ఓటింగ్ మిషన్) దశకు భారత ఎన్నికల సంఘం మార్చింది. అప్పట్లో స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు వరుస కట్టిన ఓటర్లు ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థుల నుంచి డబ్బులు ఆశిస్తున్నారు. ఏదో ఒక తాయిలం ఇస్తే తప్ప ఓటు వేసేందుకు వెళ్లడం లేదు. దీనికి తోడు ఓటు అంటే నిర్లిప్తత, అనాసక్తి ఎక్కువ ఉంది.
ఓటే ఆయుధం
ప్రజా చైతన్యానికే ఓటర్ల దినోత్సవం
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
ఓటు మారింది. బ్యాలెట్ పేపర్ దశ నుంచి ఈవీఎం (ఎలక్ర్టానిక్ ఓటింగ్ మిషన్) దశకు భారత ఎన్నికల సంఘం మార్చింది. అప్పట్లో స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు వరుస కట్టిన ఓటర్లు ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థుల నుంచి డబ్బులు ఆశిస్తున్నారు. ఏదో ఒక తాయిలం ఇస్తే తప్ప ఓటు వేసేందుకు వెళ్లడం లేదు. దీనికి తోడు ఓటు అంటే నిర్లిప్తత, అనాసక్తి ఎక్కువ ఉంది. అత్యధికంగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపించిన వారిలో విద్యాధికులే ఉండటం గమనార్హం. భారత ఎన్నికల సంఘం ఓటర్లలో చైతన్యం నింపేందుకు ఏటా ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోంది. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
మట్టికుండలో ఓటేశాను
నా వయసు 103 సంవత్సరాలు. ఇంతవరకు 20 సార్లుకు పైబడి ఓటేసినట్లు గుర్తు. ఒక రంగు వస్త్రం కట్టిన మట్టి కుండలో తొలిసారిగా అధికారులు ఇచ్చిన స్లిప్‌తో ఓటేశాను. అప్పట్లో పెద్దగా వచ్చేవారు కాదు. పొలం పనికి పోయేవారు. మంచి వ్యక్తులను గెలిపించేందుకు ఓటెయ్యాలని అప్పటి పెద్దలు నచ్చచెప్పేవారు. ఇప్పుడు ఓటుకు డబ్బులు ఇస్తున్నారు. అప్పుడైతే అభ్యర్థుల ఖర్చులకు చందాలు పోగుచేసి ఇచ్చేవాళ్లం.
- శానాపతి కోటరావు (103), కొట్టాం గ్రామం, ఎస్.కోట
స్వాతంత్రం దగ్గర నుంచి ఓటేస్తున్నాను
నాకు 97 సంవత్సరాలు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఓటేస్తున్నాను. అప్పట్లో ఏ ఎన్నికైనా బ్యాలెట్ పేపరు ఇచ్చేవారు. ఇప్పుడు ఈవీఎంలు వచ్చాయి. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు మాత్రమే గుర్తులు ఉండేవి. గుర్తులను చూపించి ఓటు అడిగేవారు. గుర్తు అలవాటు అయ్యేవరకు చూపించేవారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గెలుపు కోసం ఓటు వేసేందుకు స్వచ్ఛందగా వెళ్లేవారు. డబ్బులు ఇస్తే తిరస్కరించే వారు. ఒకరికి మాట ఇచ్చిన తరువాత వేరే అభ్యర్థిని దగ్గరకు రానిచ్చేవారం కాదు.
నెక్కల సన్యాసినాయుడు (97), రామలింగాపురం గ్రామం, కొత్తవలస
శృంగవరపుకోట, జనవరి 21 (ఆంధ్రజ్యోతి):
జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణ వెనక ఓ యువకుడి చొరవ ఉంది. 2010 సెప్టెంబర్‌లో భువనేశ్వర్‌లో ఓ ప్రజాకార్యక్రమం జరుగుతుండగా ఓ యువకుడు లేచి 18ఏళ్ల వయసు రావడం అనేది సంబరం చేసుకోవాల్సిన సందర్భం అంటూ చెప్పాడు. ఏడాదిలో ఒక్కరోజైనా 18ఏళ్ల వారు పండుగ చేసుకోవడానికి కేటాయించాలని కోరాడు. ఈ విషయం అక్కడి నేతలు, ఉన్నతాధికారులను ఆలోచింపజేసింది. ఆ విధంగా చేస్తే ఓటుపై చైతన్యం కూడా పెరుగుతుందని భావించారు. దీనిపై కేంద్ర స్థాయిలో సుదీర్ఘ కసరత్తు అనంతరం 2011 నుంచి ఓటర్ల దినోత్సవం జరుపుతున్నారు. 2011 జనవరి 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన యువకులు.. ఆ వయసు రాబోతున్న వారిని మూడునెలల ముందే గుర్తించి ఓటర్‌గా నమోదుచేస్తున్నారు. ఓటర్ గుర్తింపు కార్డును ముద్రించి అందిస్తున్నారు. వారితో పాటు సీనియర్ సీటిజన్స్, అత్యధిక సార్లు ఓటువేసిన వ్యక్తులను సన్మానిస్తున్నారు. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. ఆ మరుసటి రోజే భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అందుకే ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవం జరపాలన్న నిర్ణయం జరిగింది.
- పట్టణంలో నివశిస్తున్న విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు పోలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగులు కూడా పోలింగ్ రోజున ప్రభుత్వం ఇచ్చే సెలవును ఓటేసేందుకు కాకుండా కుటుంబాలతో విహారయాత్రలకు ఉపయోగిస్తున్నారు. దీనివల్లే ఒక్కోసారి ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఇలా అయితే ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తులు గెలిచే అవకాశం కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తూ పిల్లలకు వ్యాసరచన పోటీలు కూడా పెడుతోంది.
చైతన్య సభలకు ఏర్పాట్లు
విజయనగరం కలెక్టరేట్, జనవరి 24(ఆంధ్రజ్యోతి):
జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. మండల, నియోజకవర్గంతో పాటు జిల్లా కేంద్రంలో కూడా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఓటు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తారు. అలాగే సీనియర్ ఓటర్లను సన్మానించనున్నారు. అలాగే కొత్తగా ఓటు హక్కు పొందినవారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తారు. జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఓటర్లలో పురుషులు 14058, మహిళలు 11,003 ఉన్నారు.