Share News

Vizianagaram in traffic ట్రాఫిక్‌లో విజయనగరం

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:32 AM

Vizianagaram in traffic విజయనగరం నగరపాలక సంస్థగా మారాక ఊహించని స్థాయిలో విస్తరిస్తోంది. నలువైపులా నివాసాలు పెరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. జనాభా కూడా పెరుగుతోంది. వాహనాల సంఖ్య ఇంతలింతలవుతోంది.

Vizianagaram in traffic ట్రాఫిక్‌లో విజయనగరం
గంటస్తంభం వద్ద ట్రాఫిక్‌ రద్దీ

ట్రాఫిక్‌లో విజయనగరం

ఎక్కడా కానరాని పార్కింగ్‌ ప్రదేశాలు

నత్తనడకన సిగ్నల్స్‌ ఏర్పాటు ప్రక్రియ

చుక్కలు చూస్తున్న వాహనదారులు

విజయనగరం నగరపాలక సంస్థగా మారాక ఊహించని స్థాయిలో విస్తరిస్తోంది. నలువైపులా నివాసాలు పెరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. జనాభా కూడా పెరుగుతోంది. వాహనాల సంఖ్య ఇంతలింతలవుతోంది. అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు లేవు. పార్కింగ్‌ ప్రదేశాలు కూడా లేవు. దీంతో వివిధ పనులపై ఇంటి నుంచి బయలుదేరే వాహనదారులు తరచూ విసుక్కుంటున్నారు. గమ్యం ఎప్పటికి చేరుకుంటామో తెలియదంటున్నారు. మరోవైపు ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేస్తుండడంతో ఇదేం సమస్య అంటూ నిరాశ చెందుతున్నారు.

దాసన్నపేట, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి):

విజయనగరంలో అధికారికంగా పార్కింగ్‌ ప్రదేశాలు లేవు. ఆ ప్రభావం ప్రయాణికులపై పడుతోంది. స్థలం లేక రోడ్డుపక్కనే ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలూ నిలిపి వేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చేవారికి తమ వాహనాలు ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. జనం రద్దీ అధికంగా ఉండే ఎంజీ రోడ్డు, గంటస్తంభం నుంచి అంబేడ్కర్‌ కూడలి, కోట దారి, గుమ్చీ రోడ్డు, గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరి కోవెల దారిలో కనీస స్థాయిలో పార్కింగ్‌ ప్రదేశాలు లేవు. ఎక్కడికక్కడే వాహనాలు నిలుపుదలతో ట్రాఫిక్‌ చలానాలకు గురికాక తప్పడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో తొమ్మిది కూడళ్లలో కొత్తగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్లు వేస్తున్నారు. అయితే ఆ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. కలెక్టరేట్‌, సింహాచలం మేడ, దాసన్నపేట, అల్లూరి సీతారామరాజు కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉన్నా వినియోగించడం లేదు. ఇటీవల గంటస్తంభం కూడలిలో వాహనాల రద్దీ అధికమవుతోంది. అంబేడ్కర్‌ కూడలి, సిటీ స్టాండ్‌, మూడులాంతర్లు, ఎంఆర్‌ కాలేజీ కూడలి..ఇలా నాలుగు వైపుల నుంచి ఒకేసారి వాహనాలు రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికితోడు ఫుట్‌పాత్‌ వ్యాపారాలు, ఆక్రమణలతో ఉన్న షాపులు అడ్డంకిగా నిలుస్తున్నాయి.

రామారాయుడు దారిలో ఇరువైపులా వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో తరచూ ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. పీడబ్ల్యూ మార్కెట్‌, ఇతర రద్దీ ప్రాంతాలకు భారీ వాహనాలు అన్ని వేళల్లో వచ్చేస్తున్నాయి. కొన్ని మార్కెట్‌లోకి ప్రవేశించడం, బయటకు వస్తున్నప్పుడు రామారాయుడు దారి, ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ రూట్‌లో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. గుమ్చి నుంచి దాసన్నపేట రైతుబజారు దారిలో ఆస్పత్రులు, వాణిజ్య కాంప్లెక్స్‌లకు వచ్చే వారు వాహనాలను నిలిపివేస్తున్నారు. కంటోన్మెంట్‌ గూడ్స్‌ షెడ్‌ దారి, బిక్కవోలు వారి వీధి, గురజాడ రోడ్డు, చిన్నవీధిలో ఇలా ఎక్కడికక్కడే వాహనాలు నిలుపుదల చేస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగాలు గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

దృష్టిపెడతాం

ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగంతో సమన్వయం చేసుకుంటాం. నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తాం. ఫుట్‌పాత్‌, రోడ్డు మార్జిన్‌లో ఆక్రమణలు లేకుండా చూస్తాం. పార్కింగ్‌ ప్రదేశాల ఏర్పాటుపై దృష్టిసారిస్తాం.

- బి.బాలస్వామి, నగర పాలకసంస్థ కమిషనర్‌, విజయనగరం

Updated Date - Sep 07 , 2026 | 12:32 AM