Share News

ఊర్లు జలదిగ్బంధం

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:26 AM

నాగావళి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మడ్డువలస రిజర్వాయర్‌ నుంచి 15 వేల క్యూసెక్కులు, తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి 16,500 క్యూసెక్కులను గురువారం రాత్రి నదిలోకి విడుదల చేయడంతో నాగావళిలో వరద ఉధృతి పెరిగింది.

ఊర్లు జలదిగ్బంధం
రేగిడి మండలం కొమిరి గ్రామాన్ని చుట్టుముట్టిన వరద

ఉప్పొంగిన నాగావళి

రోడ్లపై నీటి ప్రవాహం

నిలిచిన రాకపోకలు

సంతకవిటి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): నాగావళి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మడ్డువలస రిజర్వాయర్‌ నుంచి 15 వేల క్యూసెక్కులు, తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి 16,500 క్యూసెక్కులను గురువారం రాత్రి నదిలోకి విడుదల చేయడంతో నాగావళిలో వరద ఉధృతి పెరిగింది. మడ్డువ లసకు ఇన్‌ఫ్లో పెరగడంతో శుక్రవారం ఉదయం 33వేల క్యూసెక్కులను వదిలినట్లు ఏఈ నితిన్‌ తెలిపారు. దీంతో నాగావళిలో వరద ప్రవాహం ప్రమాదస్థాయికి చేరడంతో సాయన్నగెడ్డ, నాగావళి కుడికాలువ పరిధిలో పలు గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జావాం, కొత్తూరు రామచంద్రపురం, వాసుదేవపట్నం, గోళ్లవలస, మద్దూరు శంకరపేట, చిన్నయ్యపేట, కొండగూడెం, మాధవరాయిపురం తదితర గ్రామాల పరిధిలోని పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. నారాయణపురం కుడికాలువకు పలుచోట్ల గండ్లు పడటంతో వరదనీరు పొలాలు, రహదారులపైకి భారీగా చేరింది. కొన్ని ప్రాంతాల్లో సుమారు ఆరు అడుగుల మేర నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జావాం, కొత్తూరురామచంద్రపురం, రంగారాయిపురం, పోతలజోగుపేట గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని రాకపోకలు స్తంభించాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో సుమారు 3,250 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారి యశ్వంతరావు తెలిపారు. కుడి కాలువకు కూడా గండ్లు పడటంతో మరింత విస్తీర్ణంలో పంట నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జావాంలో కోళ్లఫారం మునిగిపోవడంతో పెద్ద సంఖ్యలో కోళ్లు, కోడిపిల్లలు మృతి చెందాయి.


- ముంపు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎంపీడీవో వెళ్తుండగా ఆయన వాహనం జావాం సమీపంలో వరదనీటి మధ్యలో చిక్కుకుంది. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమదం జరగలేదు. వాహనం ఇప్పటికీ నీటి మధ్యలోనే ఉండిపోయింది.

- తహసీల్దార్‌ బి.సుదర్శనరావు, ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రహదారులపై వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

రేగిడిలో నాలుగు గ్రామాలు..

రేగిడి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమిరి, ఖండ్యాం, పుర్లి, రేగిడి గ్రామాలు శుక్రవారం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద చుట్టు ముట్టడంతో బాహ్య ప్రపంచంతో సంబాందాలు తెగిపోయాయి. 20 గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల వరి పైరు నీటమునిగింది. కొమిరి, బొడ్డవలసలలో జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌, రేగిడి, కొమిరిలో ఆర్డీవో సుధారాణీ పర్యటించారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్‌ ఈశ్వరరావు, ఎంపీడీవో శ్యామలకుమారితో జేసీ సమీక్షించారు. కొమిరి వద్ద వరదనీటిలో చిక్కుకున్న ఇద్దరు రైతులు ఈశ్వరరావు, శ్రీనివాస్‌ను రాజాం రూరల్‌ సీఐ ఉపేంద్ర, రేగిడి ఎస్‌ఐ బాలకృష్ణ ఆద్వర్యంలో స్టేట్‌ డిజార్డ్‌ రెస్క్యూ పోర్స్‌ సిబ్బంది రక్షించారు.

25-skvt-2.gif

ఉధృతంగా ప్రవహిస్తున్న నాగావళి నది

Updated Date - Sep 26 , 2026 | 12:26 AM