Village Elections రెండు దశల్లో పల్లె పోరు
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:59 PM
Village Elections in Two Phases జిల్లాలో ఇక పంచాయతీ పోరు ప్రారంభం కానుంది. పార్వతీపురం, పాలకొండ డివిజన్లలో 451 పంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 4144 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 6.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం
పార్వతీపురం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇక పంచాయతీ పోరు ప్రారంభం కానుంది. పార్వతీపురం, పాలకొండ డివిజన్లలో 451 పంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 4144 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 6.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పాలకొండ డివిజన్‌లోని భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం, కురపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల్లో ఉన్న 227 పంచాయతీల్లో మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి 13న నోటిఫికేషన్ రానుంది. 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరణ, 21 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 26న పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఇందుకోసం 2,046 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి దశలో 2.88 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.39 లక్షల మంది పురుషులు, 1.48 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 53 మంది వరకు ఉన్నారు.
పార్వతీపురం డివిజన్‌లో రెండో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 224 పంచాయతీలకు 2,102 వార్డులకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ , 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజున తుది అభ్యరుల జాబితాను విడుదల చేస్తారు. 29న పోలింగ్ జరగనుంది. ఈ డివిజన్‌లో 3.55 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 1.75 లక్షల మంది పురుషులు, 1.80 లక్షల మంది మహిళలు ఉన్నారు. వారిలో 12 మంది ఇతరులు ఉన్నారు.
పట్టణాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
పురపోరు ముగియడంతో జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసినట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్ర క్రియ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన పూర్తవడంతో ఈనెల 7వ తేదీ రాత్రి 10 గంటల నుంచి కోడ్‌ను ఎత్తివేసినట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తికానందున ఆ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ యథావిధంగా కొనసాగుతుందన్నారు.