పల్లెపోరు.. కూటమి జోరు
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:49 AM
Village Battle… Alliance Momentum! జిల్లాలో రెండో విడత పల్లెపోరు ప్రశాంతంగా ముగిసింది. అన్నిచోట్లా ఓటర్లు పోటెత్తారు. క్యూలైన్లలో నిరీక్షించి.. ఎంతో ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. వృద్ధులతో పాటు దివ్యాంగులు తదితరులు కుటుంబ సభ్యుల సహకారంతో కేంద్రాలకు వచ్చారు. పాలకొండ నియోజకవర్గంలోని భామిని, వీరఘట్టం, సీతంపేట, పాలకొండ మండలాల్లో 114 పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి.
పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు
77.02 శాతం ఓటింగ్ నమోదు
66 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం
45 గ్రామాలకే వైసీపీ పరిమితం
పార్వతీపురం/పాలకొండ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పల్లెపోరు ప్రశాంతంగా ముగిసింది. అన్నిచోట్లా ఓటర్లు పోటెత్తారు. క్యూలైన్లలో నిరీక్షించి.. ఎంతో ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. వృద్ధులతో పాటు దివ్యాంగులు తదితరులు కుటుంబ సభ్యుల సహకారంతో కేంద్రాలకు వచ్చారు. పాలకొండ నియోజకవర్గంలోని భామిని, వీరఘట్టం, సీతంపేట, పాలకొండ మండలాల్లో 114 పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. నిబంధనల ప్రకారం ఓటు గుర్తింపు కార్డు లేదా ఆధార్‌కార్డు, ఓటరు స్లిప్‌తో వచ్చిన వారికి మాత్రమే పోలీసులు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చారు. 114 పంచాయతీల్లో లక్షా 40 వేల 189 మంది ఓటర్లు ఉండగా లక్షా 7 వేల 977 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు.
- నాలుగు మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలు, 1274 వార్డులు ఉన్నాయి. వాటిలో 32 సర్పంచ్, 555 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 114 గ్రామ పంచాయతీలు, 719 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగింది. సర్పంచ్ స్థానాలకు 285 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1542 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తంగా నాలుగు మండలాల్లోని 114 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు 66 చోట్ల (టీడీపీ 23, జనసేన 43) సర్పంచులుగా గెలుపొందారు. వైసీపీ 45 పంచాయతీలకే పరిమితమైంది. సీపీఎం 1, ఇండిపెండెంట్లు 2 చోట్ల సర్పంచులుగా విజయం సాధించారు.
కూటమి మద్దతుదారుల జోరు..
- పాలకొండ మండలంలో 26 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 11 టీడీపీ, 5 జనసేన మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. పది పంచాయతీలకే వైసీపీ పరిమితమైంది. ఆరు పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తంగా ఈ మండలంలో 32 పంచాయతీల్లో 21 మంది మహిళలు, 11 మంది పురుషులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
- వీరఘట్టం మండలంలో 24 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. 1 టీడీపీ, 15 పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించారు. కేవలం ఎనిమిది పంచాయతీల్లోనే వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. పది పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- భామిని మండలంలో ఎనిమిది పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 19 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. 6 టీడీపీ, 4 చోట్ల జనసేన మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించారు. ఏడు పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు.
- సీతంపేట మండలంలో 45 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 5 టీడీపీ, 19 చోట్ల జనసేన మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందారు. 20 పంచాయతీల్లో వైసీపీ , ఒక పంచాయతీ సీపీఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఎనిమిది పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పోలింగ్ శాతం ఇలా..
- పాలకొండ నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 29.15 శాతం , 11 గంటలకు 64 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 77.02 శాతం మేర పోలింగ్ నమోదైంది. పాలకొండలో అత్యధికంగా 84.67 శాతం, భామిని మండలంలో అత్యల్పంగా 74.48 శాతం మేర పోలింగ్ నమోదు అయింది.
- పాలకొండ మండలంలో 26 పంచాయతీలు, 226 వార్డులు పరిధిలో 31,539 మంది ఓటర్లుకు గాను 26,704 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీతంపేట మండలంలో 45 పంచాయతీలు, 259 వార్డులు పరిధిలో 39,526 మందికి గాను 29,754 మంది ఓటర్లు ఓటు వేశారు. ఈ మండలంలో 75.28 శాతం పోలింగ్ నమోదైంది. వీరఘట్టం మండలంలో 24 గ్రామాలు, 206 వార్డుల పరిధిలో 40,810 మందికి గాను 30,430 మంది ఓటు వేశారు. ఇక్కడ 74.57 శాతం పోలింగ్ నమోదైంది. భామిని మండలంలో 19 పంచాయతీలు, 164 వార్డుల పరిధిలో 28,314 మంది ఓటర్లకు గాను 21,089 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
పాలకొండ : పాలకొండ మండలంలోని పలు పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ క్రేందంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నియమాలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. మరో వైపు సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ కూడా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. టీడీ పారాపురం పోలింగ్ బూత్‌తో పాటు అంపిలి తదితర పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మాధవరెడ్డి సందర్శించారు. వీరఘట్టం మండలం నడిమికెల్ల, విక్రంపురం, వీరగట్టం, చిదిలి, నీలానగరం, మెట్ట వెంకటాపురం, పనసనందివాడ, తలవరం, పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్లు ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు నాలుగు మండలాల్లోని 147 పోలింగ్ కేంద్రాలల్లో సుమారు 640 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేం ద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.
టీడీపారాపురంలో హైటెన్షన్..
పాలకొండ మండలం బెజ్జి పంచాయతీ టీడీపారాపురంలో ఆదివారం హైటెన్షన్ నెలకొంది. ఉదయం 7 గంటల నుంచి ఆ గ్రామంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.25 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో 60 మంది ఓటర్లు టీడీపారాపురం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే సమయం ముగిసిందని ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు నిరాకరించారు. తాము సుదూర ప్రాంతం నుంచి వచ్చామని, ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందేనని ఎంపీపీ ప్రతినిధి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయడు పట్టుబడ్డారు. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఓటర్లు పంచాయతీ కేం ద్రమైన బెజ్జిలో టీడీపారాపురం నుంచి బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా బైఠాయించి నిరసన తెలిపారు. వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పాలకొండ డిఎస్‌పి ఎం.రాంబాబు, సిబ్బంది వారికి సముదాయించారు. మొత్తంగా గంటపాటు హైడ్రామా నడిచింది. అనంతరం పోలీసులు ఓటర్లకు నచ్చజెప్పి టీడీ పారాపురం నుంచి బ్యాలెట్ బాక్సులను బెజ్జిలో ఓట్లు లెక్కింపు కేంద్రానికి తరలించారు. దీంతో ఎన్నికల సిబ్బంది ఊరిపీల్చుకున్నారు.