Share News

‘వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌’

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:00 PM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా వికసిత్‌ భారత్‌ - రోజ్‌గార్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ) వీబీ-జీ రామ్‌జీ నూతన చట్టం అమల్లోకి రానుంది.

‘వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌’
పంట పొలాల్లో బౌండరీ ట్రెంచ్‌ పనులు చేపడుతున్న వేతనదారులు(ఫైల్‌)

అమలుకు సన్నాహాలు

-ఈ నెల 5న పంచాయతీల్లో గ్రామసభలు

- ప్రజలకు అవగాహన కల్పించనున్న అధికారులు

- కొత్త చట్టం ప్రకారమే పనుల నిర్వహణకు చర్యలు

గరుగుబిల్లి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి):మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా వికసిత్‌ భారత్‌ - రోజ్‌గార్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ) వీబీ-జీ రామ్‌జీ నూతన చట్టం అమల్లోకి రానుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పరిధిలోని 451 పంచాయతీల్లో ఈ నెల 5న ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉపాధి ఉన్నతాధికారులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. 2005లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం ప్రారంభమైంది. సుమారు 20 సంవత్సరాల తదుపరి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. గ్రామసభలో వీబీ-జీ రామ్‌జీ కొత్త చట్టంలోని ముఖ్య అంశాలను అధికారులు వివరించడంతో పాటు అవగాహన కల్పించనున్నారు. గ్రామసభలను పంచాయతీ నిర్ణయ్‌ యాప్‌ లేదా వీబీ-జీ రామ్‌జీ మొబైల్‌ యాప్‌లో ఫొటోలు పొందుపర్చాల్సి ఉంది. సంబంధిత ఉపాధి సిబ్బంది మొబైల్‌లో ఏపీపీ గూగుల్‌ ప్లే స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో పొందుపర్చాల్సి ఉంది

125 పని దినాలు..

గతంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పనిదినాలు కల్పించేవారు. వీటిని కొత్త చట్టం ద్వారా 125 రోజులకు పెంచారు. గ్రామీణ ప్రాంతంలోని కుటుంబాలకు వార్షిక ఆదాయం సుమారు 25 శాతానికి పెరగనుంది. గతంలో శారీరక శ్రమతో కూడిన పనులకే పరిమితం కాగా, ఇకపై ప్రధాన కీలక అంశాలకు ప్రాధాన్యత, నీటి భద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి కల్పన, వాతావరణ మార్పుల నిరోధక పనులు జరగనున్నాయి. పంటల సాగు సమయంలో 60 రోజుల వరకు ఉపాధి పనులు నిలిపి వేస్తారు. దీంతో రైతులకు కూలీల కొరత తగ్గి, సాగు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. గతంలో పంచాయతీల పరిధిలో లేబర్‌ బడ్జెట్‌ ప్రకారం ప్రణాళికలు రూపొందించేవారు. ఇకపై వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళిక ఆధారంగా పనులు కల్పన జరగనుంది.

పనుల గుర్తింపునకు గ్రామసభలు

వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళికల్లో అవసరమైన పనులను గుర్తించేందుకు గ్రామసభలను నిర్వహించాలి. అభివృద్ధికి సంబంధించి పలు శాఖల సమన్వయంతో శుభ్రత, ఆస్తులకై ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రణాళికలను నిర్ణయ్‌ యాప్‌లో పొందుపర్చాలి. పనుల నాణ్యతను, కూలీల హాజరు (డిజిటల్‌ అటెండెన్స్‌)తో నిరంతరం పర్యవేక్షించాలి. ప్రతి వారానికి సంబంధించి వేతనాల చెల్లింపుల సమాచారాన్ని బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి. డిజిటల్‌ సిస్టమ్‌ విధానంలో సమాచారాన్ని అందించాలి. సామాజిక తనిఖీ ప్రక్రియను బలోపేతం చేయాలి. పారదర్శకత, సాంకేతికకు సంబంధించి పనుల నిర్వహణ, పర్యవేక్షణ జీపీఎస్‌ మొబైల్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లలో జరగనుంది.

- నీటి సంరక్షణ, సాగునీటి వసతులు, భూగర్భ జలాల రీచార్జ్‌, నీటి వనరుల పునరుజ్జీవనం, వాటర్‌ షెడ్ల అభివృద్ధికి సంబంధించిన పనులు అనుమతించనున్నారు.

- గ్రామీణ వసతుల్లో భాగంగా పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామీణ రహదారులు, కల్వర్టులు, గ్రామ లైబ్రరీలు, చెత్త సంపద కేంద్రాలు, సౌర వీధి దీపాలు, గృహ నిర్మాణం పనులతో పాటు పలు రకాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

-వ్యవసాయం, పశు పోషణ, మత్స్యకార రంగం, గ్రామీణ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధితో ఆదాయం పెంపు వంటి పథకాల నిర్వహణ. ఆత్మ నిర్భర్‌ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతానికి చర్యలు చేపట్టనున్నారు.

నూతన చట్టం అమలుకు చర్యలు

ఈ నెల 5న గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తాం. ఈ మేరకు ఎంపీడీవోలు, ఉపాధి సిబ్బందికి సమాచారం అందించాం. నూతన చట్టం అమలుపై ప్రత్యేక అవగాహన కల్పిస్తాం. ఈ చట్టం మేరకు పంచాయతీల్లో పనులు నిర్వహించాల్సి ఉంటుంది.

కె.రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం

Updated Date - Jan 01 , 2026 | 11:00 PM