Victims of cheating తాడోపేడో తేల్చుకోవాలని..!
ABN , Publish Date - May 06 , 2026 | 11:45 PM
"Victims of cheating" ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేలాది మంది నుంచి వందలకోట్ల రూపాయలు వసూలుచేసి బోర్డు తిప్పేసిన ఓ ప్రైవేటు సంస్థ మోసాలపై బాధితులు పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు.
తాడోపేడో తేల్చుకోవాలని..!
రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థపై బాధితుల గుర్రు
నెరవేరని హోమంత్రి అనిత హామీ
పోలీసు విచారణలో కానరాని పురోగతి
ఎస్పీ ఆఫీసుల ఎదుట ధర్నాకు సన్నాహాలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేలాది మంది నుంచి వందలకోట్ల రూపాయలు వసూలుచేసి బోర్డు తిప్పేసిన ఓ ప్రైవేటు సంస్థ మోసాలపై బాధితులు పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. రోజులు గడుస్తున్నా పోలీసు విచారణలో పురోగతి లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు సంస్థ బాగోతంపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నాలుగురోజుల్లో పురోగతి చూస్తారని సాక్షాత్తు హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత ఇచ్చిన హామీ నేటికీ అమలుకాకపోవడంపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు జిల్లాల ఎస్పీ కార్యాలయాల ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
విజయనగరం క్రైం, మే 6(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు సంస్థ బాగోతంపై ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. మాయమాటలు నమ్మి డబ్బంతా సంస్థ చేతిలో పెట్టి వేలాది కుటుంబాలు వీధిపాలైన వ్యవహారం ఉత్తరాంధ్రలో సంచలనం సృష్టించింది. ఎక్కడివారక్కడ సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తూ, మరోవైపు ఎస్పీకి కూడా స్వయంగా వినతిపత్రాన్ని అందజేశారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని అట్నుంచి వచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది. విశాఖ పరిసర ప్రాంతాల బాధితులు అక్కడి పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు ఇస్తే అక్కడా అదే పరిస్థితి. ఆశలు వదులుకుంటున్న సమయంలో గతనెలలో విజయనగరంలో పర్యటించిన హోంమంత్రి అనిత బాధితుల భుజంతట్టి మరీ భరోసా ఇవ్వడం వారిలో కొత్త ఆశలు రేకెత్తించింది. నాలుగు రోజుల్లో మంచివార్త వింటారని చెప్పడం ధైర్యాన్ని నింపింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి పురోగతి కనిపించలేదు.
జిల్లా పోలీసు శాఖ నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో బాధితుల ఆవేదన, ఆందోళన మళ్లీ మొదటికే వచ్చింది. సంస్థ మాటలు నమ్మి ఆస్తులన్నీ కోల్పోయి రోడ్డునపడ్డ కుటుంబాలు ఇక తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటివరకు శాంతియుతంగా పోరాడుతూ వస్తున్న బాధితులు ఎస్పీ కార్యాలయాల ఎదుట ఆందోళనకు తీర్మానించుకున్నారు. ఎస్పీ, కలెక్టర్ ఇచ్చిన హామీకి దిక్కు లేనపుడు, సాక్షాత్తు హోమంత్రి భరోసాకు అర్థం లేనప్పుడు ఆందోళన పథమే శరణ్యమన్న అంతిమ నిర్ణయానికొచ్చారు. అనేక పోలీస్ స్టేషన్‌లలో సంస్థ ఎండీ, టీమ్ లీడర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎండీని ఇంతవరకు విచారించకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల మినహా పోలీసులు తటస్థంగానే ఉంటున్నారని బాధితుల గోడు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసి నెలన్నర దాటిందని, అయినా ఫలితం కానరాలేదని, విచారణలోనూ పురోగతి లేదని అంటున్నారు. బాధితుల్లో పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక నుంచి పోరాటంలో ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా ముందుకే వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. అప్పటికీ ప్రైవేటు సంస్థదే పైచేయి అయితే వేలాది కుటుంబాలు కలిసి ’చలో అమరావతి’ చేపట్టాలని యోచిస్తున్నారు. మొత్తమ్మీద ప్రైవేటు సంస్థ వ్యవహారం అతిత్వరలోనే కొత్తమలుపు తిరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.