Share News

..Via Vizianagaram from Odisha ..వయా విజయనగరం ఫ్రం ఒడిశా

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:53 PM

..Via Vizianagaram from Odisha జిల్లాలో పట్టుబడుతున్న గంజాయి రవాణాకు సంబంధించి మూలాలన్నీ ఒడిశా వైపే చూపిస్తున్నాయి. జిల్లాలో గంజాయి సాగు లేకపోయినప్పటికీ ఒడిశా నుంచి జిల్లా మీదుగా రవాణా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

..Via Vizianagaram from Odisha ..వయా విజయనగరం  	   ఫ్రం ఒడిశా

- ఒడిశా నుంచి విశాఖ తరలిస్తున్న 647 కిలోల గంజాయి ఈ నెల 15న బొండపల్లి వద్ద పట్టుబడింది. పక్కా సమాచారంతో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు బొండపల్లి మండలం గొట్లాం జాతీయ రహదారిపై పట్టుకున్నారు. వ్యాన్‌లో పైన క్యాబేజీతో పాటు ఇతర కూరగాయలు ప్యాక్‌ చేశారు. కింద గంజాయిని దాచారు. ఒడిశాలోని సిమిలిగూడ నుంచి విశాఖకు తరలిస్తుండగా ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు.

- ఈ నెల 6న రామభద్రపురం వద్ద ఇద్దరు వ్యక్తులను రెండున్నర కిలోల గంజాయితో పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఇదే మండలంలో 11 మందితో కూడిన బృందం గంజాయితో పట్టుబడింది. ఒడిశా నుంచి రామభద్రపురం మీదుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాలకు గంజాయి తరలించడం వీరి పని. పక్కా సమాచారంతో పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు.

- గత నెల 20న బొబ్బిలి సమీపంలో 11 మంది విద్యార్థులు గంజాయితో పట్టుబడ్డారు. జూనియర్లకు సీనియర్లు గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విద్యాసంస్థల వెనుక లేఅవుట్లలో గంజాయి విక్రయం జరుగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని రాయగడ నుంచి గంజాయి తెచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.

- జనవరి 10న రామభద్రపురం మండలంలో 8 మంది యువకులు గంజాయితో పట్టుబడ్డారు. రాజాం, వంగర ప్రాంతానికి చెందిన యువకులు మూడు బైకులతో ఒడిశాలోని సుంకి నుంచి గంజాయి తెస్తుండగా పట్టుబడ్డారు. వీరంతా విద్యార్థులే కావడం గమనార్హం.

..వయా విజయనగరం

ఫ్రం ఒడిశా

ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆ రాష్ట్రం పేరే

జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు తరలింపు

పక్కదారి పడుతున్న జిల్లా యువకులు

రకరకాల పేర్లతో రవాణా చేసే యత్నం

తాజాగా కూరగాయల లోడు మాటున తరలింపు

విజయనగరం, మార్చి 17(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పట్టుబడుతున్న గంజాయి రవాణాకు సంబంధించి మూలాలన్నీ ఒడిశా వైపే చూపిస్తున్నాయి. జిల్లాలో గంజాయి సాగు లేకపోయినప్పటికీ ఒడిశా నుంచి జిల్లా మీదుగా రవాణా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఏకంగా పోలీస్‌స్టేషన్లు దాటి వెళుతుండడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం గంజాయిని కట్టడి చేసేందుకు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరోను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఆ విభాగం ఆధ్వర్యంలో పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది విస్తృతంగా దాడులు చేస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. నిందితుల ఆస్తులు జప్తు చేస్తున్నారు. అయినా సరే గంజాయి రవాణా అదుపులోకి రావడం లేదు. కోట్లాది రూపాయల్లో వ్యాపారం సాగడమే కారణంగా తెలుస్తోంది. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షపడుతున్నా డబ్బుపై ఆశతో యువత గంజాయి రవాణాకే మక్కువ చూపుతోంది. దొరికితేనే దొంగ లేకుంటే దొర అన్న చందంగా వారి ఆలోచన ఉంది.

మార్గాలు ఎన్నో..

జిల్లాకు ఒడిశాతో పాటు చత్తీస్‌గడ్‌కు రోడ్డు మార్గం ఉంది. ఆపై రైల్వేపరంగా కూడా దగ్గర మార్గం. దీంతో అక్రమార్కులు ఒడిశా నుంచి గంజాయిని చాలా సులువుగా జిల్లా మీదుగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అయితే ఇలా రవాణా చేసి పట్టుబడుతోంది ఎక్కువగా ఒడిశా యువత. ఆపై మన జిల్లాకు చెందిన విద్యార్థులు సైతం పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా గంజాయి హబ్‌గా మారిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రధానంగా కాలేజీలు, విద్యాసంస్థలున్న చోట గంజాయి దొరకడం ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం, బొబ్బిలి, రాజాం, కొత్తవలస ఎడ్యుకేషనల్‌ హబ్‌లుగా ఉన్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు ఇతర విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అటువంటి చోట ఎక్కువగా గంజాయి చలామణి అవుతున్నట్టు తాజా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.

ఎత్తుకు పైఎత్తులు వేస్తూ..

రవాణాయే లక్ష్యంగా గంజాయిని ద్రవ పదార్థంగా కూడా మార్చుతున్నారు. రకరకాల రూపంలో తరలిస్తున్నారు. తాజాగా కూరగాయల మాటున రవాణా చేస్తూ దొరికిపోయారు. ఆ మధ్య విశాఖలో చాక్లెట్ల రూపంలో కూడా గంజాయి పట్టుబడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎస్‌.కోట, సాలూరు, పార్వతీపురం నుంచి జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. అలా చలామణి అవుతున్న గంజాయి అంతా ఒడిశా నుంచి తెచ్చినదేనని అర్థమవుతోంది. మన జిల్లాకు సంబంధించి రోడ్డు మార్గాల్లో చెక్‌పోస్టులు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు పెంచితే కొంత నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైనా నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో దూకుడుగానే ఉంది. జిల్లా పోలీస్‌ శాఖ ఉక్కుపాదం మోపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రత్యేక దృష్టి..

గంజాయి రవాణా, వినియోగంపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టాం. జిల్లా అంతటా పటిష్ట నిఘా పెట్టాం. ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదు. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు.. ఇప్పటికే ఈగల్‌, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరోలు రంగంలోకి దిగాయి. అదే విధంగా డ్రోన్‌ కెమెరాల ద్వారా..డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నాం. పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతోంది. ఏ మూలంలో వెళుతున్నా అడ్డుకట్ట వేస్తున్నాం. నిందితులపై కేసుల నమోదు మాత్రమే కాదు. ఏకంగా ఆస్తులను సైతం జప్తు చేస్తున్నాం.

- ఏఆర్‌ దామోదర్‌, ఎస్పీ, విజయనగరం

---------------

Updated Date - Mar 17 , 2026 | 11:53 PM