Veterinary Camps నేటి నుంచి పశు వైద్య శిబిరాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:18 AM
Veterinary Camps Begin from Today రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నేటి నుంచి అన్ని మండలాల్లో పశు వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
జియ్యమ్మవలస, జనవరి18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నేటి నుంచి అన్ని మండలాల్లో పశు వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిలో భాగంగా పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వనున్నారు. టీకాలు, వ్యాక్సిన్లు కూడా వేయనున్నారు. మొత్తంగా 15 మండలాల పరిధిలో 24 మంది పశు వైద్యాధికారులు, 280 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. జిల్లాలో సీతంపేట, పాలకొండ, కురుపాం, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, సాలూరులో పశు వైద్యశాలలు ఉన్నాయి. వాటి పరిధిలో 38 పశు వైద్య చికిత్సాలయాలు, 35 గ్రామీణ పశువుల యూనిట్లు (ఆర్‌ఎల్‌వో)లు ఉన్నాయి. 2019 లెక్కల ప్రకారం.. జిల్లాలో పశు సంపద 14.67 లక్షలు కాగా ఇందులో ఆవులు 2.29 లక్షలు, గేదెలు 49 వేలు ఉన్నాయి. పశు సంపదను కాపాడి.. పాడి రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నెల 19 నుంచి 31 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా పశువులను పరీక్షలు నిర్వహించి శాస్త్రీయ సూచనలు అందిస్తారు. గర్భ కోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అంది స్తారు. మూగజీవాలతో నట్టల నివారణ మందులు తాగిస్తారు. పశు పోషకులు, జీవాల పెంపకందారులకు శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన కల్పించనున్నారు. ‘ పశు వైద్య శిబిరాలు ప్రతీ గ్రామంలో నిర్వహిస్తున్నాం. పాడి రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలి.’ అని జిల్లా పశు సంవర్థకశాఖ జేడీ మన్మథరావు తెలిపారు.
పశు బీమాతో రైతుకు ధీమా
ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన పశు బీమా పథకం తిరిగి ప్రారంభం కాబోతోంది. గత ప్రభుత్వం మృతి చెందిన పశువులకు కేవలం నష్టపరిహారం మాత్రమే ఇవ్వగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బీమా పథకం ప్రారంభానికి చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో రైతులకు ఆర్థికంగా భారం కాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85 శాతం రాయితీతో ఈ బీమా పథకాన్ని వర్తింప చేయనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కాబోతున్న పశు వైద్య శిబిరాల్లో ఈ బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం వసూలు చేయనున్నారు. ఉత్పాదక దశలో ఉన్న, ఒకసారి ఈనిన 2-10 సంవత్సరాల ఆవులు, 3-10 సంవత్సరాల మేలు జాతి(సంకర జాతి/దేశీయ) గేదెలకు రూ.30వేల, నాటు పశువులకు ఒక్కొక్కదానికి రూ.15 వేలు పశు బీమా చెల్లిస్తారు. ఒకటిన్నర సంవత్సరాలు పైబడిన మేలు జాతి (సంకరజాతి/దేశీయ) ఎద్దులు, దున్నలకు రూ.30 వేలు, 2 సంవత్సరాలు పైబడిన నాటు ఎద్దులు, దున్నలకు ఒక్కొక్కదానికి రూ.15 వేలు బీమాను చెల్లిస్తారు. రూ.30 వేలు విలువైన పశువుకు బీమా ప్రీమియం 1920 చెల్లించాలి. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85 శాతం వాటాగా రూ.1632లు భరిస్తాయి. మిగిలిన కేవలం రూ.288 (15 శాతం రైతు వాటా) పశుపోషకులు చెల్లించాల్సి ఉంటుంది.