Share News

very sad insident అమ్మా... నడుం నొప్పిగా ఉందే..

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:19 AM

very sad insident పాఠశాలకు వెళ్లిన కూతురు రాకకోసం ఎదురుచూస్తున్నారా తల్లిదండ్రులు. రోజూ ఒంటిగంటకు వచ్చేసే అమ్మాయి రెండుగంటలు కావస్తున్నా ఎందుకు రాలేదోనన్న టెన్షన్‌తో ఉన్న వారికి ‘మీ అమ్మాయి పాఠశాల నుంచి వస్తూ పుచ్చలవీధిలో పడిపోయిందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని’ చెప్పడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

very sad insident అమ్మా... నడుం నొప్పిగా ఉందే..
కూతురి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు

అమ్మా... నడుం నొప్పిగా ఉందే..

ఇదే ఆఖరి పిలుపు

కళ్లముందే కూతురు మృతి

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

పాఠశాల నుంచి ఇంటికి వస్తూ పడిపోయిన చిన్నారి

చికిత్స పొందుతూ ఏరియా ఆసుపత్రిలో మృతి

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళ్లిన కూతురు రాకకోసం ఎదురుచూస్తున్నారా తల్లిదండ్రులు. రోజూ ఒంటిగంటకు వచ్చేసే అమ్మాయి రెండుగంటలు కావస్తున్నా ఎందుకు రాలేదోనన్న టెన్షన్‌తో ఉన్న వారికి ‘మీ అమ్మాయి పాఠశాల నుంచి వస్తూ పుచ్చలవీధిలో పడిపోయిందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని’ చెప్పడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి వైపు పరుగులు తీశారు. అప్పటికే ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్న కూతురుని చూసి వారికి కన్నీరు ఆగలేదు. తల్లిదండ్రుల్ని చూసిన చిన్నారి.. కాస్త తేరుకుని అమ్మా నడుం బాగా నొప్పిగా ఉందని రెండు మూడు సార్లు చెబుతూ కళ్లు తేలేసింది. అదే ఆఖరి పిలుపు అయింది. వైద్యులు చికిత్స అందిస్తుండగానే బాలిక కన్నుమూసింది. కళ్లముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనతో రాజాం ఏరియా ఆసుపత్రి విషాదమయమైంది. హృదయ విదారకరమైన ఈ ఘటన రాజాం ఏరియా ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.

రాజాం పట్టణంలోని ఠాణావీధిలో నివాసం ఉంటున్న షేక్‌ గఫూర్‌, నాగూబీబీల కుమార్తె ముంతాజ్‌ (13) రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే గురువారం కూడా పాఠశాలకు వెళ్లిన ఆమె మధ్యాహ్నం 12.45కి పాఠశాల విడచిపెట్టిన తరువాత అక్కడే భోజనం చేసి ఇంటిబాట పట్టింది. ఎండలో నడచుకుంటూ వెళ్తూ మార్గమధ్యలో పుచ్చలవీధి వద్ద ఒక్కసారిగా పడిపోయింది. చూసిన స్థానికులు స్కూటీపై రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే పాప పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు సకాలంలో స్పందించి వైద్యసేవలు ప్రారంభించారు. కూతురు ఆసుపత్రిలో ఉందన్న విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లిదండ్రుల్ని చూసిన ముంతాజ్‌ అమ్మా నడుం నొప్పిగా ఉందని చెబుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రి హృదయవిదారకమైంది. అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. ముంతాజ్‌ వడదెబ్బతో మృతి చెందిందా, కార్డియాటిక్‌ అరెస్ట్‌ వల్ల ప్రాణం పోయిందా నిర్ధారించలేమని ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు.

Updated Date - Apr 17 , 2026 | 12:19 AM