Venugopala... where are your lands? వేణుగోపాలా... నీ భూములెక్కడ?
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:49 PM
Venugopala... where are your lands? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల భూములకు రీసర్వే జరుగుతున్న నేపథ్యంలో ఈ సారైనా నీ భూములు నీకు దక్కేనా వేణుగోపాలా... అని భక్తలోకం ఆర్తితో స్వామిని అడుగుతోంది.
వేణుగోపాలా... నీ భూములెక్కడ?
రీ సర్వేలోనైనా దక్కేనా!
స్థిర ఆస్తులున్నా ఆదాయం లేని వైనం
470 ఎకరాలు అన్యాక్రాంతం
దశాబ్దాల తరబడి అదే స్థితిలో
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల భూములకు రీసర్వే జరుగుతున్న నేపథ్యంలో ఈ సారైనా నీ భూములు నీకు దక్కేనా వేణుగోపాలా... అని భక్తలోకం ఆర్తితో స్వామిని అడుగుతోంది. ఆస్తులున్నా ఆదాయం లేని స్థితికి నొచ్చుకుంటున్న భక్తులు స్వామికి పూర్వవైభవం రావాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నారు. అందుకు ఆయనకు దక్కాల్సిన భూములను పూర్తిస్థాయిలో గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆక్రమణదారుల చెరనుంచి భూములను స్వాధీనం చేసుకునేందుకు దశాబ్దాలుగా దేవదాయ శాఖాధికారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉన్నాయి. ఇప్పుడు జరిగే రీ సర్వేలోనైనా న్యాయం జరుగుతుందని భక్తులు ఆశిస్తున్నారు.
బొబ్బిలి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి):
చారిత్రాత్మకమైన బొబ్బిలి పట్టణానికి తలమానికంగా నిలుస్తున్న వేణుగోపాలస్వామి ఆలయానికి అపారమైన స్థిర ఆస్తులు, సంపద ఉన్నా ఆదాయం సమకూరడం లేదు. ఆయన భూములు ఆక్రమణలో ఉండడమే ఈ దుస్థితికి కారణం. 499.17 ఎకరాలతో పాటు విలువ కట్టలేని రీతిలో మణులుమాణిక్యాలు, ఆభరణాలున్నాయి.సుమారు 470 ఎకరాలు అన్యాక్రాంతంలో ఉండగా, ఆభరణాలు వగైరా బ్యాంకుల్లో నిక్షిప్తమై ఉన్నాయి.
1857వ సంవత్సరంలో బొబ్బిలి సంస్థానాథీశులు నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళాసంపదతో అలరారుతోంది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయి న్యాయమూర్తులు, ప్రముఖులు, పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఆలయ భూములు పార్వతీపురం మన్యం జిల్లా అజ్జాడ గ్రామంలో 474.81 ఎకరాలు, గొల్లపల్లిలో 10.27 ఎకరాలు, పాతబొబ్బిలిలో 9.04 ఎకరాలు, ఎంబనవలసలో 3.65 ఎకరాలు, నారాయణపురంలో 1.40 ఎకరాలున్నాయి. ఈ భూములన్నింటిలో కేవలం మూడెకరాలపై మాత్రమే రూ.3,500 ఆదాయం వస్తోంది. పాతబొబ్బిలి, గొల్లపల్లి, ఎంబన్నవలస భూములపై నామమాత్రపు ఆదాయం వస్తోంది. అజ్జాడ భూములలో సుమారు 470 ఎకరాలు అన్యాక్రాంతంలోనే ఉన్నాయి. వారి చెరనుంచి భూములను స్వాధీనం చేసుకునేందుకు దేవదాయ శాఖాధికారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ దశాబ్దాలుగా విఫలమవుతూ ఉన్నాయి. రెండేళ్ల క్రితం దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఆ గ్రామానికి వెళ్లి భూములను సాగుచేసుకుంటున్న వారికి అవగాహన కల్పించి ఆలయానికి చెందిన భూములపై వచ్చే ఆదాయంలో ఎంతో కొంత అప్పగించాలని కోరారు. కోర్టులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని వారికి నచ్చజెప్పారు. అప్పటికీ సరే అన్న వారంతా ఆ తరువాత ససేమిరా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. భూముల స్వాధీనానికి న్యాయపరమైన చర్యలను పకడ్బందీగా చేపడతామని దేవదాయ శాఖాధికారులు ప్రకటించారు. టిక్కెట్లు, కొద్దిపాటి భూమి శిస్తు తదితర వాటిపై ఆలయానికి సుమారు రూ.8 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నప్పటికీ దీనిపై మరో లక్షన్నర రూపాయలకు పైగా ఆలయ నిర్వహణ ఖర్చులవుతున్నాయి.
- ఆలయ ట్రస్టీగా రాజవంశీయులు, మాజీ మంత్రి ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు వ్యవహరిస్తున్నారు. వ్యవస్ధాపక ట్రస్టీగా ఆయన తండ్రి దివంగత బొబ్బిలి రాజా ఆర్‌వీజీకే రంగారావు వ్యవహరించేవారు. ఆయన ఆధ్వర్యంలో ఆలయానికి వైభవాన్ని తెచ్చేందుకు తన చిన్న తనయుడైన బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కెకె రంగారావు (బేబీనాయన) చాలా ఏళ్లనుంచి నడుంబిగించారు. బేబీనాయన సొంత నిధులను వెచ్చించి ఆలయానికి ఆగమ పండితుల సూచనల మేరకు మరమ్మతు పనులు చేయించడమే కాక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా పూలంగి సేవ చెప్పుకోదగ్గది. ఆర్వీజీకే రంగారావు హయాంలో 120 కిలోల వెండిని విక్రయించి తద్వారా వచ్చిన రూ.7.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయించారు.
ఫ వేణుగోపాలస్వామి ఆలయ భూములను అప్పగించేందుకు ఆక్రమణదారులు ముందుకు రావడం లేదు. భూములెక్కడెక్కడ ఉన్నాయో అన్నదానిపై రెవెన్యూ అధికారులు ఎంతలా మల్లగుల్లాలు పడినా నిర్ధారించలేకపోతున్నారు. అక్రమంగా సాగుచేసుకుంటున్న వారంతా వచ్చి దేవదాయశాఖతో ఏదోలా ఓ ఒప్పందం కుదుర్చుకోవాలని దేవాదాయశాఖాధికారులు ప్రాధేయప డుతున్నా వారెవరూ ముందుకు రావడం లేదు.
ఆ 1800 ఎకరాలు మాయమేనా?
విజయనగరం మాన్సాస్ సంస్ధతో ఇరు రాజుల ఒప్పందం మేరకు శిస్తు వసూలు , నిర్వహణ తదితర వాటికోసం 1800 ఎకరాల భూములను అప్పట్లో అప్పగించారు. ఆ భూములన్నీ ఎస్టేట్ అబాలిస్ యాక్టు కింద పోయాయని మాన్సాస్ అధికారులు బదులిస్తున్నారు. ఈ భూముల మనుగడపై కూడా స్పష్టత లేదు.
మా వంతు ప్రయత్నాలు చూస్తూనే ఉన్నాం
తులసి, ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి, బొబ్బిలి
ఆలయ భూములకు సంబంధించి శాఖాపరంగా పోరాడుతూనే ఉన్నాం. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాం. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. తాజాగా జరుగుతున్న రీసర్వేలో అజ్జాడ భూముల లెక్కలు తేల్చాలని రెవెన్యూ వారిని కోరాం. భూముల సమస్య తీరితే ఆలయ పురోభివృద్ధి ఇంకా బాగుంటుంది.
==============