చెత్తతో నిలిచిపోయిన వాహనాలు
ABN , Publish Date - May 08 , 2026 | 12:34 AM
కొత్తవలస మేజర్ పంచాయతీకి సంబంధించి నాలుగు చెత్త వాహనాలు చెత్త వేయడానికి ఎటువంటి స్థలం లేక స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలోనే గురువారం ఉదయం నుంచి నిలిచిపోయాయి.
ఎటూ తేలని కొత్తవలస డంపింగ్‌యార్డు సమస్య
కొత్తవలస, మే 7(ఆంధ్రజ్యోతి): కొత్తవలస మేజర్ పంచాయతీకి సంబంధించి నాలుగు చెత్త వాహనాలు చెత్త వేయడానికి ఎటువంటి స్థలం లేక స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలోనే గురువారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉన్న డంపింగ్‌యార్డులో చెత్త వేయకుండా కొత్తవలస పంచాయతీ రాజన్నకాలనీ వాసులు అడ్డుకోవడం, రెవెన్యూ శాఖ ఎటువంటి ప్రత్యామ్నాయ స్థలం చూపించకపోవడంతో ఈ పరిస్థితి దాపరించింది. డంపింగ్‌యార్డును ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి తరలించాలని జిల్లా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించాలని ఎంపీడీవో రమణయ్యకు కొత్తవలస పంచాయతీ కార్య నిర్వహణాధికారి ప్రసాద్ కోరారు. ఈమేరకు ఎంపీడీవో.. తహసీల్దార్ రమాలక్ష్మికి స్థలం చూపించాలని సూచించగా, కొత్తవలస పంచాయతీ పరిధిలోని పలు ప్రభుత్వ స్థలాలను చూపించారు. అయితే అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో తహసీల్దార్ కొత్తవలస సర్వే నెంబరు 173లో స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలం డంపింగ్‌యార్డుకు అసలు అనువుగా లేదని, చెత్త వాహనాలు వెళ్లడానికి సరైన రహదారి లేదని, లోతైన గెడ్డ, గెడ్డ దాటి వెళితే కొండ ఉందని, ఇలాంటి ప్రాంతంలో ఎలా చెత్తను డంపింగ్ చేయాలని ఈవో ప్రసాద్ ప్రశ్నించా రు. విశాఖపట్టణం కాపులుప్పాడ ప్రాంతంలో ఉన్న డంపింగ్‌యార్డుకు తీసుకు వెళ్లాలంటున్నారని, కొత్తవలస నుంచి అక్కడకు సుమారు 50 కిలోమీటర్లు దూరం ఉంటుందని ఆ ప్రాంతానికి తీసుకెళ్లడం సాధ్యమ య్యే పని కాదంటున్నారు. గురువారం సేకరించిన చెత్తను ఎక్కడ వేయాలో తెలియకపోవడంతో చెత్త వాహనాలు పంచాయతీ కార్యాలయం వద్దనే ఉండిపోయాయన్నారు.
యధావిధిగా కొనసాగించాలంటూ రిలే దీక్ష
ప్రస్తుతం ఉన్న డంపింగ్‌యార్డులోనే చెత్త వేయాలంటూ కొత్తవలపకు చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మాన్యం దేముడు గురువారం రిలే దీక్ష చేపట్టా రు. కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసమే డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవసరమైతే డంపింగ్‌యార్డును ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే ఉంచాలంటూ అమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.