Share News

Vehicle Rentals వాహనాల అద్దె రూ.2.35 లక్షలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:57 PM

Vehicle Rentals Cost ₹2.35 Lakh సీతంపేట ఐటీడీఏలో కొన్నాళ్లుగా అద్దె వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇన్‌చార్జి పీవోతో పాటు ఇతర శాఖల అధికారుల హైర్‌ వాహనాలకు ఏటా రూ.లక్షల్లో చెల్లిస్తుండడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. కొన్ని శాఖల్లో అద్దె ప్రాతిపదికన వినియోగిస్తున్న వాహనాలు ఎక్కడికీ కదలడం లేదు. అయినప్పటికీ వాటికి ప్రతినెలా అద్దె మాత్రం చెల్లిస్తుండడం గమనార్హం.

Vehicle Rentals  వాహనాల అద్దె  రూ.2.35 లక్షలు
సీతంపేట ఐటీడీఏ కార్యాలయం

  • కొన్నేళ్లుగా పెరుగుతున్న అద్దె వాహనాల వినియోగం

  • కొన్ని శాఖల్లో కదలని వెహికల్స్‌.. మరికొన్ని శాఖల్లో సొంతానికి వాడకం

  • ఇన్‌చార్జి పీవో కొత్త వాహనం కొనుగోలుకు అనుమతి ఇచ్చినా అధికారుల వెనకడుగు

  • రూ.లక్షల్లో బిల్లుల చెల్లింపులు.. తప్పని అదనపు భారం

  • గిరిజన సంఘాల పెదవి విరుపు

సీతంపేట, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏలో కొన్నాళ్లుగా అద్దె వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇన్‌చార్జి పీవోతో పాటు ఇతర శాఖల అధికారుల హైర్‌ వాహనాలకు ఏటా రూ.లక్షల్లో చెల్లిస్తుండడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. కొన్ని శాఖల్లో అద్దె ప్రాతిపదికన వినియోగిస్తున్న వాహనాలు ఎక్కడికీ కదలడం లేదు. అయినప్పటికీ వాటికి ప్రతినెలా అద్దె మాత్రం చెల్లిస్తుండడం గమనార్హం. మరికొన్ని శాఖలు వినియోగించే వాహనాలకు అవసరాలకు మించి ఆయిల్‌ కేటాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ అద్దె వాహనాలనే కొంతమంది సొంత అవసరాలకు వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని శాఖలకు తిరుగుతున్న వాహనాలు గిరిజనులకు చెందినవి కూడా ఉన్నాయి. ఏదేమైనా ఐటీడీఏలో నెలకొన్న పరిస్థితిపై గిరిజన సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

ఇదీ పరిస్థితి..

సీతంపేట ఐటీడీఏకు 2017 నుంచి తొమ్మిదేళ్ల కాలంలో 12మంది పీవోలు పనిచేశారు. వారిలో ఆరుగురు రెగ్యులర్‌ ఐఏఎస్‌ పీవోలు కాగా మిగిలిన వారు ఇన్‌చార్జి పీవోలుగా కొనసాగుతు వచ్చారు. వాస్తవంగా ఐటీడీఏ పీవోకు 2014లో టీడీపీ ప్రభుత్వం కొత్త స్కార్పియో వాహనాన్ని కేటాయించింది. 2017వరకు ఐటీడీఏ పీవోలుగా ఉన్న గ్రూప్‌ వన్‌ స్థాయి అధికారులు ఈ వాహనాన్నే వినియోగించారు. అయితే 2017లో పీవోగా వచ్చిన శివశంకర్‌(ఐఏఎస్‌) స్కార్పి యోను పక్కన పెట్టి ఇన్నోవా(హైర్‌ వెహికిల్‌)ను అద్దె ప్రాతిపదికన వినియోగించడం ప్రారం భించారు. అయితే అప్పటి నుంచి ఐటీడీఏలో అద్దె వాహనాల సంస్కృతి కొనసాగుతుంది.

వినియోగం ఇలా..

- 2017 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు (సుమారు 108 నెలలు) ఒక్క ఐటీడీఏ పీవోలు వినియోగించే ఇన్నోవా వాహనానికి అద్దె కింద రూ.48.60 లక్షల వరకు చెల్లించారు. ఈఏడాది జూలై వరకు సుమారు ఎనిమిదేళ్లకు పైగా హైర్‌ వెహికిల్‌(ఇన్నోవా)కు నెలకు రూ.45వేల చొప్పున అద్దె చెల్లించారు. ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ వినియోగిస్తున్న ఇన్నోవా అద్దె వాహనం పాతపడిందని ఇటీవల కొత్త ఇన్నోవా వాహనాన్ని ఏర్పాటుచేశారు. దీనికి ఐటీడీఏ నుంచి నెలకు రూ.60వేలు అద్దె చెల్లించేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

- ఐటీడీఏ పరిధిలోని టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ, డీడీ, డిప్యూటీ ఈవోలు, పీఎంఆర్‌సీ విభాగం, వెలుగు డీపీఎంలు కూడా విధి నిర్వహణలో భాగంగా అద్దె వాహనాలను వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.35 వేల నుంచి రూ.40వేల వరకు అద్దె రూపంలో బిల్లులు చెల్లిస్తున్నారు.

- ప్రాజెక్ట్‌ హార్టికల్చర్‌ అధికారి తన సొంత వాహనం వినియోగిస్తున్నప్పటికీ ఆయిల్‌ మాత్రం ఐటీడీఏ చెల్లిస్తోంది. దీంతో నెల అయ్యే సరికి పీవో వినియోగిస్తున్న అద్దె వాహనంతో కలుపుకుని మొత్తంగా రూ.2.35లక్షల వరకు బిల్లుల రూపంలో అద్దె వాహనాలకు ఐటీడీఏ చెల్లిస్తోంది.

- మొత్తంగా ఐటీడీఏ అధికారులు వినియోగిస్తున్న అద్దె వాహనా లకు ఏడాదికి సుమారు రూ.28లక్షలకు పైగా వెచ్చించాల్సి వస్తోంది.

అద్దె వాహనానికి ఐటీడీఏ డ్రైవర్లు

పీవో తిరిగే వాహనం అద్దెదైనప్పటికీ డ్రైవర్లు మాత్రం నాటి నుంచి నేటి వరకు ఐటీడీఏలో టైంస్కేల్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న వారే. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వారు.. అద్దె వాహనానికి డ్రైవర్‌లుగా తిరుగుతుండడంపై గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

అనుమతులున్నా..

సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోకు సొంత వాహనం కొనుగోలు కోసం ఇటీవల అధికారులు శ్రీకాకుళం కలెక్టర్‌కు నివేదించారు. అయితే ఆయన అనుమతులు ఇచ్చినా ఐటీడీఏ అధికారులు మాత్రం సొంత వాహనం కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. ఐటీడీఏలో ఏపీవో వినియోగించే ప్రభుత్వ వాహనం కూడా పాతబడి తరచూ మొరా యిస్తోంది. దీంతో ఆయన కూడా అద్దె వాహనం కోసం ప్రతిపాదనలు పెట్టారు.

ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే...

‘ కొత్త వాహనం కొనుగోలుకు బడ్జెట్‌ లేదన్నారు. నేను కొంత కాలంగా వినియోగిస్తున్న ఇన్నోవా వాహనం పాతబడింది. దీంతో అద్దె ప్రాతిపదికన కొత్త వాహనం ఏర్పాటు చేశారు. ఇతర శాఖల అధికారులు వినియోగిస్తున్న అద్దె వాహనాలు, వాటికి చెల్లిస్తున్న బిల్లులు, ఆయిల్‌ కూపన్ల వినియోగంపై దృష్టిసారిస్తా.’ అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు.

Updated Date - Sep 18 , 2026 | 11:57 PM